కాకితో కబురు
ఆ వేపచెట్టు కింద తలెత్తకుండా అం ట్లు తోముతోందే- ఆ పిల్ల పేరు జువ్వి. ‘మడిసల్లే ఎందుకు బతుకుతావే! మాన ల్లే పడుండు సుకపడతావు’ అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరెట్టిందేమో తెలియదు. కానీ, జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలు గంటోంది. జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం చెట్టుమీది కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మతొర్రల్లోంచి పరుగెత్తుకొస్తాయి. రామచిలకలు చిటారు కొమ్మనించి కింద కొమ్మలమీదికి రివ్వున వచ్చి వాలతాయి. జున్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గర కొస్తాయి.
‘ఉండండే! ఒకటే తొందర’ అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తప తన కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి. గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయిమీద పెడ్తే వాట్ని కలేబడ్తూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. ‘కొట్టుకు చావమోకండే కాస్త దానికి’ అని మందలిస్తుంది జువ్వి. ఓ కూరముక్క తొర్రలోంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసుర్తుంది. కొమ్మ మీదున్న రామచిలకని చూసి ‘నువ్వు రాణివాసం పిట్టవాయె! నువ్వు ఎంగిలి మెతుకులకొస్తావా! ఇదో!’ అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలక ముక్కున పట్టుకుంటే కిందపడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరుగెత్తుతుంది.
ఏదో తినటం అయిపోయిందిగదా అని వెళ్లిపోవు పక్షులు. జువ్వి అంట్లు తోముతుంటే చు ట్టూ సభ చేసినట్టు చేరతాయి. ఓ కాకి రాయిమీ ద, ఇంకోటి గుట్టమీద, మరోటి బోర్లించిన గిన్నెమీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆల కిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన వూసంతా వీటికి వెళ్లబోసుకుంటుంది.
‘చింతాలు మావ ఏ రేవు నున్నాడో సూసిరాకూడదంటే! ఆడి పడవ అమరావతొడ్డు తాకి నెల్రోజులయింది. నా మెళ్లో తాళికడ్తే నేను సక్కంగ వంట చేసి పెడ్దునా? ఆడు పడవల్లో సేరి ఆళ్లకీ ఈళ్లకీ వండి పెట్టే కర్మ ఏంది? అవున్లే ఆడిదేం తప్పు? మా అయ్యదే తప్పు ‘సంపాదన లేనోడికి పిల్లనిస్తా నా’ అన్నాడు. పడవల్లో వంటపుట్టి కింద చేరి పోయిండు. అమ్మ పోయినకాణ్ణించి అయ్యనిడిసిపెట్టలేక నేనున్నాను. నేం తెచ్చే అన్నం మె తుకుల కోసం నన్నిడిసి పెట్టనంటడు అయ్య. పోన్లే నా అన్నం తింటే తిన్నాడు. ఆణ్ణీ, ఈణ్ణీ డబ్బులడుక్కుని ఆ తాగుడెందుకంట! ఏం జే స్తాం చెప్పు. తాగినా తన్నినా అయ్య అయ్యే కద. నేను మా మావెంట ఎల్లిపోతే ఆడికి దిక్కెవరు?
ఏవే! మావ పడవ దొండపాడు రేవుకాడుందన్నారే ఎట్టుండాడో చూసి రాకూడదంటే, ఆడు లాంచీల్లో చేర్తాడని ఎవరో సెప్పారు. ఒద్దని సెప్పవే! లాంచీల్లో చేర్తే కిట్ట ఇడిసిపెట్టి గోదార్లో కెల్తాడు. అసలే సూపందదు.
రోజూ ఇదే పాట... జువ్వి మళ్లీ మళ్లీ చెప్తూండడం కాకులు అంతా తెలిసిపోయినట్లు, ‘ఆలో చిస్తాం!’ అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటూండడం, ఇంతలో ఇంటావిడ ‘జువ్వీ! ఎవరితోనే మాట్లాడుతున్నావు’ అంటే ‘ఏం లేదమ్మా! ఈ కాకులు ఒకటే రొద! హేయ్’ అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చెయ్యటం మామూలు.
ఆరోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడుపిండి పెట్టి ‘తినవే’ అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూ డా అంట్లు తోమేది. ఇంటివాళ్లు ఏవన్నా పెడ్తే జువ్వితల్లి మొగుడికి తెలియకుండా ఐదేళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడ్తే కాని తినేది కాదు. ‘తినవే’ అని తల్లి అంటే ‘అయ్యకో?’ అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుం టే ‘ఏడుపెందుకే పిచ్చిదానా!’ అని ఇంటావిడ సముదాయిస్తే జువ్వి కళ్లు తుడుచుకుని ‘ఇంటికెళ్లి తింటానమ్మా’ అంది. ‘ఓసి వెర్రి! మీ అ య్యకు నేను వేరే ఇస్తా. నువ్వు తిను’ అని ఆవిడంటే అప్పుడు జువ్వి ము ఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకుపరుగెత్తింది.
శ్రావణ మాసాన
కృష్ణ నిండుగా వొడ్లు పొంగి పారుతున్నవేళ. పూజారి వీధి ఇళ్లు ఆనుకుని కృష్ణ పారుతుంటే, కృష్ణ మధ్యనుంచి వడిలో పడవలు పోలేవు కనుక వొడ్డమ్మటే పడవలు లాక్కెతుళుంటే పడవలన్నీ దొడ్లలోంచి పోతున్నట్లుండేవి.
తెల్లవారగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం. జువ్వితోపాటే కాకులూ, ఉడతలూ, రామచిలుకలూను. అంట్లు తోముతోందేకాని పడవలమీ దే ధ్యాస, పరుగెత్తికెళ్లి ప్రతి పడవ చూస్తోంది. చింతాలు మాన పడవ రాలేదు. కాకులన్నీ కావు కావు మంటూ కృష్ణమీది కెళ్లాయి. అంటే పడవొస్తోందన్నమాట, జువ్వి అంట్లగిన్నెతో పరుగెత్తుకెళ్లింది. మాసికల తెరచాప పడవ దగ్గరకొస్తోంది.
జువ్వి గుండె దబదబ కొట్టుకుం టోంది. అల్లడుగో! చింతాలు మావ! చుక్కాని దగ్గర వంట గిన్నెతో చెయ్యూపాడు. జువ్వి అం ట్లగిన్నె వూపింది. పడవ దగ్గర కొస్తోంది. జువ్వి కళ్లు పొంగాయి వొళ్లు పొంగింది. కళ్లలో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గర కొచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్లన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదామనిపించింది. మాట రాలేదు. చింతాలుకి ఏదో చెప్దా మనిపించింది - గొంతు పెగల్లేదు.
పడవ జువ్వి ని దాటిపోతోంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ వొడ్డుమీదికి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరమయింది. చింతాలు మావ వెళ్లిపోయా డు. ఇంటావిడ ఇంట్లోంచి ‘జువ్వీ!’ అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతు కుంటూ దొడ్లో కొచ్చి ఎక్కడలేని సంబరంతో ఒకచేత అంట్లు తోముతూ ఇంకోచేత ప్రి యంగా జామకాయ కొరుక్కుతింటోంది. తనిం త కొరుక్కుని ఇంత ముక్క కాకులకి పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలకల కెగరేసింది.
ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడ్తే ఆకు పట్టుకు ఏడ్చింది జువ్వి. ‘మీ అయ్యకి నేను వేరే పెడ్తాలేవే’ అన్నా జువ్వికి ఏడుపు ఆగలేదు. జువ్వి మళ్లీ ఏడ్చింది అయ్య కోసం గాదు చిం తాలు మావ కోసం.కళ్లు తుడుచుకొని ఇవతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో, ఉడతలతో, చిలకలతో అంది.‘మా మావ పడవ ధరణికోట రేవు కాడుంటది. మీరెళ్లి నేను మావకోసం ఏడవలేదని చెప్పండే! నవ్వానని చెప్పండేం!’ అంటూ గలగ లా నవ్వింది.
కథకుడు: సత్యం శంకరమంచి (నవోదయ పబ్లిషర్స్ ప్రచురించిన ‘అమరావతి కథల’ సంకలనం నుంచి సేకరించినది)






