4 April, 2026 | 6:33 AM

రామాయంపేటలో మున్సిపల్ పనులపై ప్రజాగ్రహం

10-01-2026 12:00 AM

రోడ్డెక్కిన ఆరో వార్డు ప్రజలు

రామయంపేట, జనవరి 9 : రామాయంపేట మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో చేపడుతున్న సీసీ రోడ్డు పనులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వార్డులో ఏళ్లుగా పేరుకుపోయిన మౌలిక వసతుల సమస్యలను పక్కనపెట్టి నామమాత్రపు పనులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాల వంటి కీలక సమస్యలు పరిష్కారం కాని పరిస్థితిలో ముందస్తు ప్రణాళిక లేకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టడంపై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ముందు మురుగు కాలువలు సరిచేయాలి& ఆ తర్వాతే రోడ్డు వేయాలని చెప్పినా అధికాలు వినిపించుకోకపోవడం ఆగ్రహానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల నాణ్యతపైనా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణాలకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయని, అవసరమైన మందం లేకుండా కాంక్రీట్ వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా యంత్రాంగం వ్యవహరిస్తోందని, ఇదే తీరైతే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రామాయంపేట మున్సిపల్లో అభివృద్ధి పేరుతో సాగుతున్న పనుల నాణ్యత, పారదర్శకతపై ఈ ఘటన మరోసారి పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.