10-01-2026 12:00:00 AM
రామాయంపేట, జనవరి 9 : రామాయంపేట మంజీర విద్యాలయంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, పండుగల వెనుక ఉన్న తాత్త్వికతను అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగవల్లుల పోటీల్లో పాల్గొని చక్కని ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
చిన్నారులకు భోగిపళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదించగా, భోగిమంటలు వెలిగించి చెడును తొలగించి మేలును ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. పతంగులు ఎగురవేయడం, సంప్రదాయ నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో మారుమోగింది. జయంత్, హరిప్రీత్, నితీష్, ప్రణీత్, కార్తికేయలు హరిదాసులుగా, గంగిరెద్దు వేషధారణలో హాజరై విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు.
కొంతమంది విద్యార్థినులు గోదాదేవి వేషధారణలో చక్కని నృత్యాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు వాసవి, మౌనిక, మీనా, శ్రీశైలం, సంధ్య, సుస్మిత, శ్రీనితతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.