calender_icon.png 26 November, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలి

26-11-2025 04:53:22 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని అధికారులకు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కులను కాపాడే మహత్తర పత్రంగా నిలిచిందన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం మార్గదర్శకమని పేర్కొన్నారు. పౌరులందరూ రాజ్యాంగంలో ప్రతిపాదించిన మౌలిక హక్కులు, కర్తవ్యాలు తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు.

ప్రజాసేవలో ఉన్న ప్రతి ఉద్యోగి రాజ్యాంగ విలువలను పాటిస్తూ పారదర్శకత, నిబద్ధతతో పనిచేస్తేనే మంచి పాలన సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్మించేందుకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.