calender_icon.png 26 November, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ ఉత్పత్తుల భవిష్యత్తు డిమాండ్

26-11-2025 04:24:25 PM

చరిత ఆర్గానిక్ యూనిట్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్‌లో అమలవుతున్న సేంద్రియ పద్ధతులు, కౌజు పిట్టల పెంపకం విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి ప్రక్రియలు, ప్యాకేజింగ్ మార్కెటింగ్ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. యూనిట్‌లో సేంద్రియ విధానాల్లో తయారుచేసే ఉత్పత్తులు విస్తృతంగా ఉన్నాయి.

మునగాకు ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఇప్ప లడ్డు, ఇప్ప నూనె, లెమన్ టీ, కారం పొడులు, పచ్చళ్ళు, హెర్బల్ సోప్‌ల సహా మొత్తం 102 రకాల ఉత్పత్తులు సేంద్రియ పద్ధతిలో తయారుచేసి విక్రయిస్తున్నారు. గ్రామీణ వనరులను వినియోగిస్తూ, సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తులను ఎండబెట్టి, రసాయన రహిత విధానంలో ప్రజలకు అందించడం ప్రత్యేకత. పరిశుభ్రత, ప్యాకేజింగ్, మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ ప్రశంసించారు. యూనిట్‌లో సేంద్రీయ పద్ధతుల్లో ఆరోగ్యకరమైన కౌజు పిట్టల గుడ్లు, మాంసం ఉత్పత్తి చేయడం, స్థానిక మార్కెట్‌లో మంచి ఆదరణ పొందడం కూడా కలెక్టర్ అభినందనీయమని చెప్పారు. పక్షులకు అందించే ఆహార దాన సిద్ధం పద్ధతి, గాలి ప్రసరణ, షెడ్, పరిశుభ్రత చర్యలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తులపై భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉంటుంది.

ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దృష్ట్యా సేంద్రియ  విధానాలు తప్పనిసరి అవుతున్నాయి అని, కౌజు పిట్టల పెంపకానికి అవసరమైన దానాన్ని బయటి మార్కెట్ నుండి కొనుగోలు చేయకుండా, మొక్కజొన్న పిండి, పల్లి చెక్క వంటి స్థానిక వనరులను ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో తయారు చేయడం ద్వారా రైతులకు ఖర్చులను తగ్గించడమే కాక, ఉత్పత్తుల నాణ్యతను పెంచుతుందని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కౌజు పిట్టల పెంపకంపై ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి యూనిట్లు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని. భవిష్యత్తులో ఈ యూనిట్ ద్వారా కౌజు పిట్టల పెంపకానికి అవసరమైన దానాన్ని ఇతర గ్రామాలకు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించవలసిందిగా సూచించారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో చరిత ఆర్గానిక్ యూనిట్ చైర్మన్ జయ, డాక్టర్ సోమరాజు దొర, యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.