26-11-2025 04:30:17 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ మండల శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన వలి అనే ఇసుక వ్యాపారి అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నాడు. అందుకు అవసరమయ్యే మట్టిని కొంతమంది కార్మికుల చేత మల్కాపూర్ గ్రామ శివారు నుంచి ట్రాక్టర్ ఫై అక్రమంగా తరలిస్తున్నాడు.
ట్రాక్టర్ ఫై కర్నూలు జిల్లా దేవరకొండ మండలం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ మట్టిని తరలించే క్రమంలో డ్రైవర్ పక్కన ఇంజన్ పై కూర్చుని అదుపుతప్పి కింద పడడంతో ట్రాక్టర్ టైరు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ట్రాక్టర్ ని తాడూరు పోలీస్ స్టేషన్ కు తరలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మరో ఆరు ట్రాక్టర్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నట్లు స్థానికులు తెలిపారు.