18-10-2025 11:30:45 AM
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (Backward classes) 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శనివారం బంద్ పాటించడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ప్రయాణికులు బస్ స్టాపుల్లోనే చిక్కుకుపోయారు. ప్రైవేట్ క్యాబ్‌లు రెట్టింపు ఛార్జీలు వసూలు చేశాయని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో బలవంతంగా బస్సులను నిలిపివేశారని ప్రయాణికులు తెలిపారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ (BC JAC) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 9న మధ్యంతర స్టే జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) డిపోల వద్ద వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు. బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్(Jubilee Bus Station) వద్ద జరిగిన నిరసనలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెల్లవారుజామున సేవలకు పాక్షిక అంతరాయం ఏర్పడిందని, అనేక జిల్లాల్లో బస్సులు రోడ్లపైకి రాలేదని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీపావళికి ముందే ప్రజా రవాణా నిలిచిపోవడంతో నగర ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయారు. నగరంలో బీసీ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రైవేట్ క్యాబ్స్ డ్రైవర్లు(Private cab drivers) ప్రయాణికులను విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిమంటున్నారు. ప్రైవేట్ కార్ల డ్రైవర్లు ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు రూ.200 చార్జ్ చేస్తుండగా, బంద్ కారణంగా రూ.800 డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఒక్కరికి రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.