ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అరెకపూడి గాంధీ
కూకట్ పల్లి, జూన్ 23 (విజయక్రాంతి): ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ నెహ్రూ నగర్ కాలానికి చెందిన నుస్రత్ జాన్ కు రూ.2 లక్షల50 వేల రూపాయల ఎల్‌ఓసి పత్రాలను మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ నగర్ కాలనీకి చెందిన శ్రీమతి నుస్రత్ జాన్ కు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌ఓసి ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఎల్ వో సి ద్వారా మంజూరు అయినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు.
అనారోగ్యాలకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా వైద్యానికి సహకారం అందించిన పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు మిరియాలప్రీతం, శ్రీనివాస్ రెడ్డి, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.






