9 July, 2026 | 6:39 PM

విధుల పట్ల సమయపాలన పాటించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

09-07-2026 05:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికలు, కార్యాలయ రికార్డులు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాల నమోదు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు, సిబ్బంది విదుల పట్ల సమయపాలన పాటించాలని, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని తెలిపారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ఈ నెల 24వ తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఓటర్ల నుండి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలలో పొందుపరిచిన సమాచారాన్ని బి.ఎల్.ఓ. యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులుగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనిన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి భూభారతి పెండేసి వివరాలను పరిశీలించారు. వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

అనంతరం నెన్నెల మండలం ఆవడం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల తహసిల్దార్ శ్రీనివాస్ తో కలిసి సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పథకం అమలు, సైన్స్ వేర్ నిర్వహణ, రిజిస్టర్లను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, భోజనశాల, అదనపు గదులు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పించి  నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా విద్యారంగం దేశంలో, రాష్ట్రంలో ఉన్నత స్థానాలలో నిలిచిందని, జిల్లాలో దాదాపు 320 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందన్నారు. అడ్మిషన్లలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో 3 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఒక గుర్తింపు ద్వారా 75 శాతం హాజరు నమోదు అవుతుందని తెలిపారు. జిల్లాలో 700 లకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఈ పాఠశాలలలో దాదాపు 44 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్యా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యారంగంలో రూ.150 కోట్లు  ఖర్చు చేయడం జరిగిందని, ఇందులో సి.ఎస్.ఆర్. రూ. 80 కోట్ల, ఈ.జి.ఎస్. రు.20 కోట్ల , సమగ్ర శిక్ష రు.11 

కోట్లు నాబార్డు 6 కోట్ల నిధులు ప్రధానమంత్రి జన్ మన్ 3 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి జుగా రూ.3 కోట్ల లతో పాటు ప్రభుత్వ నిధులతో పాఠశాలల అభివృద్ధి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కల్పిస్తున్న సౌకర్యాలతో పాఠశాలలలో అడ్మిషన్లు అడుగుతున్నారని తెలిపారు.