26 February, 2026 | 10:16 AM

సమయపాలన పాటించాలి

25-02-2026 12:00 AM

కలెక్టర్ కె.హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సమీకృత కలెక్టరేట్ భవనం లోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది హాజరు రిజిస్టరును పరిశీలించిన కలెక్టర్, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారో లేదో వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె. హరిత తెలిపారు.

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, జనరల్ మరియు వృత్తి విద్య కోర్సులకు చెందిన 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, సరిపడ ఫర్నిచర్, వెలుతురు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బీఎన్‌ఎస్ చట్టం సెక్షన్ 144 అమలు చేస్తామని, పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల రవాణాలో భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వ హించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాలను పోలీసు బం దోబస్తుతో పరీక్ష కేంద్రాలకు తరలించాలనిష పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.