22-10-2025 08:20:57 AM
ఉపయోగం లేని భేటీకి సమయం వృధా చేసుకోను: ట్రంప్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణను మాస్కో తిరస్కరించడంతో చర్చల ప్రయత్నాలపై అస్పష్టత ఏర్పడటంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin-Trump summit) మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సమావేశం మంగళవారం వాయిదా పడింది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మధ్య ఫోన్ చర్చలు జరిగాయి. ఫోన్ చర్చల అనంతరం సమావేశానికి దూరంగా ఉండటంతో అధ్యక్షుడు ట్రంప్, అధ్యక్షుడు పుతిన్‌తో తక్షణ భవిష్యత్తులో సమావేశం అయ్యే ప్రణాళికలు లేవని వైట్ హౌస్(White House) సీనియర్ అధికారి తెలిపారు.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి తాను, పుతిన్(Putin-Trump) త్వరలో హంగేరీలో సమావేశమవుతామని ట్రంప్ గత వారం ప్రకటించారు. కానీ పుతిన్ రాయితీలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఏదైనా కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలని మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. శిఖరాగ్ర సమావేశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు లేవని తెలిపారు. ఉపయోగం లేని భేటీకి సమయం వృధా చేసుకోవాలని లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నం చేశారు. చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.