18-11-2025 12:56:03 AM
రామగుండం, నవంబర్ 16 (విజయక్రాంతి): గట్టు వామన్‌రావు దంపతుల హత్యపై పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌లో సోమవారం సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆయన భార్య, మంథని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ హాజరయ్యారు. సాయంత్రం మూడు గంటల సమయంలో పుట్ట మధు కమిషనరేట్‌లోకి ప్రవేశించగా దాదాపు మూడు గంటల పైగా సీబీఐ అధికారులు పుట్ట మధు దంపతులను విచారణ చేశారు.
వామన్‌రావు దంపతుల హత్య తర్వాత మీ అల్లుడు శ్రీను మీకే ఎందుకు ఫోన్ చేశాడని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు కుటుంబ సభ్యులకు, వామన్‌రావుకు శత్రుత్వం గురించి కూడా ఆరా తీసినట్లు తెలిసింది.
అలాగే వారి హత్యకు ముందు జరిగిన పరిణామాల గురించి లోతుగా ప్రశ్నించినట్లు, హత్యలో పాల్గొన్న వారితో పుట్ట మధుకు ఉన్న సంబంధాల గురించి కూడా ప్రశ్నించినట్లు, వీటన్నిటికీ పుట్ట మధు సీబీఐకి సహకరించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిసింది.
బీసీ బిడ్డను కాబట్టే కక్ష సాధింపు: పుట్ట మధు
తాను బీసీ బిడ్డను అయినందుకే తనపై, తన భార్యపై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని పుట్ట మధు మీడియా సమావేశంలో ఆరోపించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తుల కేసు కాబట్టి ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో వామన్‌రావు కేసును మంత్రి శ్రీధర్‌బాబు.. వామన్‌రావు తండ్రి కిషన్‌రావుతో వేయించాడని ఆరోపించారు. అదే మంథని మధుకర్ కేసు ఇప్పటికీ హైకోర్టులోనే ఉన్నదని, ఆ కేసును ఎందుకు సుప్రీంకోర్టులో వేయలేదని ప్రశ్నించారు.
మంథని మధుకర్ కేసులో ఉన్నది ఎస్సీ, బీసీ బిడ్డలని అందుకే ఆ కేసును విచారణ చేయటం లేదని ఆరోపించారు. తనను మానసికంగా వేధించినప్పటికీ తన వెంట దాదాపు 70వేల మంది ఓటర్లు ఉన్నారని, కేసులకు భయపడకుండా సీబీఐ అధికారులకు పూర్తిస్థాయిలో తాము సహకరించామని, సీబీఐ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై సమాధానం చెపుతామని మధు తెలిపారు. సీబీఐ విచారణకు పుట్ట మధు దంపతులు రామంగుండ కమిషనరేట్‌కు హాజరవగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.