17-07-2025 12:00:00 AM
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
ఖమ్మం, జూలై 16 (విజయ క్రాంతి):విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళీ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి బుధవారం సంబంధిత అధికారులతో మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద 11 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళీ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మనమంతా ధృడచిత్తంతో పని చేయాలన్నారు.తెలంగాణ విద్యా కమీషన్ తరపున ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రవేశ పెట్టాలని సిఫార్సు చేశామని అన్నారు.
మధిర నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో టీచింగ్ సరిగ్గా జరిగేలా,ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలని అన్నారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు మధిర నియోజకవర్గం పరిధిలో ఉన్న 5 మండలాల్లో ఎంపిక చేసిన 11 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు క్రింద సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని అన్నారు.
దీనిని ప్రత్యేక శ్రద్దతో అమలు చేయాలని సూసించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, విద్యా శాఖ ఈఈ విన్సెంట్ రావు, మండల విద్యా శాఖ అధికారులు, విద్యా శాఖ డిఈ లు, ఏఈ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.