ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చారకొండ, జూన్ 5: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తమ పిల్లలను చేర్పించాలని జీహెచ్‌ఎం భగవాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బడిబాటలో భాగంగా మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల్లో నిమగ్నమైన కూలీలతో మాట్లాడి, తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అవగాహన కల్పించారు. అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన బోధన అందుతుందన్నారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, దుస్తులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్షిప్ల వంటి సహాయ సహకారాలను కూలీలకు విడమర్చి చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు వేల రూపాయల ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల చొరవపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే అడ్మిషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






