నాణ్యత కరువైంది
- కేసీఆర్ ఆదేశాల వల్లే ప్రాజెక్టు స్థలం మార్చారు
- కేంద్ర జల్‌శక్తి సలహాదారు వెదిరె శ్రీరాం
- నాకు సంబంధం లేదు: వికాస్‌రాజ్
- దోపిడీకి కేరాఫ్ కాళేశ్వరం: ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణకు శుక్రవారం ఎమ్మెల్సీ కోదండరాం, కేంద్ర జల్‌శక్తి సలహాదారు వెదిరే శ్రీరాం, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ హాజరయ్యారు.
అవసరమైన పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వలేకపోయిందని కేంద్ర జల్‌శక్తి సలహాదారు వెదిరే శ్రీరాం కమిషన్ ఎదుట తెలిపారు.
ప్రాణహిత చేవెళ్లను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వెనక ఎవరి పాత్ర ఉందని కమిషన్ అడిగిన ప్రశ్నకు, అప్పటి తెలంగాణ సీఎం అని తెలిపారు. ఎన్డీఎస్‌ఏ చెప్పిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని వివరించారు. ఎన్డీఎస్‌ఏ సిఫారసు చేసినప్పటికీ బరాజ్ కింద ఉన్న గుంతలను పూడ్చివేశారని, దాంతో బరాజ్‌ల కింద జియో టెక్నికల్ డేటాను పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.
మేడిగడ్డ బరాజ్ నిర్మాణం విషయంలో కనీస ఇన్వెస్టిగేషన్ చేయలేదని.. డేటా, డిజైన్స్, మోడల్స్ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని చెప్పారు. సరైన డీపీఆర్ లేకుండానే బరాజ్ నిర్మించారని ఆయన కమిషన్‌కు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లేకుండానే సీడీఓను డిజైన్స్ అడిగారని, సీడీఓ ఇచ్చిన డిజైన్స్ కూడా సరిగా ఫాలో అవ్వలేదని, కన్‌స్ట్రక్షన్ సైతం సక్రంగా చేయలేదని, డిజైన్లను ఇష్టానుసారంగా మార్చేశారని శ్రీరామ్ తెలిపారు.
సీడీఓ ఇచ్చిన మోడల్స్ సక్రమంగా నిర్మాణం చేపట్టలేదని.. ఫలితంగా హైడ్రాలిక్, స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయన్నారు. సీడీఓకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇవ్వలేదని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ సైతం అధ్వానంగా ఉందని, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కూడా ప్రొసీజర్ ప్రకారం లేదన్నారు.
2019 ప్రారంభంలోనే మేడిగడ్డలో సమస్యలను గుర్తించినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగానే నష్టం జరిగిందని అన్నారు. డిజైన్స్‌కు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని, ఉన్నట్లుగా ప్రచారం చేశారని శ్రీరాం తెలిపారు. తుమ్మడిహట్టి వద్ద నీట లభ్యత ఉన్నా మహారాష్ట్రలో ముంపు వంక చూపిస్తూ ప్రాజెక్టు లొకేషన్‌ను మార్చేశారని శ్రీరాం పేర్కొన్నారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు. మూడు బరాజ్‌లు నీటి నిల్వకు ఉపయోగపడతాయా అని కమిషన్ ప్రశ్నించగా.. కేవలం రెగ్యులేట్ చేసేందుకు మాత్రమే పనికివస్తాయని శ్రీరాం తెలిపారు. అనంతరం మీడియాతోనూ ఆయన మాడ్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉంటే గ్రావిటీతో నీటి పారుదల ఉండేదని తెలిపారు. ఈ మూడు బరాజ్‌లు పనికివస్తాయా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏకు ఇచ్చే డేటాను బట్టి చెప్పగలమని అన్నారు.
అఫిడవిట్‌లో ఉన్నవన్నీ కరెక్టే..
తాను ప్రిన్సిపల్ సెక్రటరీగా సాగునీటి శాఖను పర్యవేక్షించినప్పుడు మైనర్ ఇరిగేషన్, ఆర్‌అండ్‌ఆర్ మాత్రమే చూశానని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు బరాజ్‌ల నిర్మాణంలో తనకు ఎటువంటి పాత్ర లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కమిషన్‌కు తెలిపారు.
అఫిడవిట్‌లో తాను కమిషన్‌కు ఇచ్చిన సమాచారం అంతా కరెక్టేనని అయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో తనకు సంబంధం లేదన్నారు. కాగా శనివారం ప్రాజెక్టుకు సంబంధించి పనులు చేపట్టిన గుత్తేదార్లను కమిషన్ విచారణకు పిలిచినట్లుగా సమాచారం.
దోపిడీకి కేరాఫ్ కాళేశ్వరం: ఎమ్మెల్సీ కోదండరాం
గత ప్రభుత్వానికి దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. శుక్రవారం కాళేశ్వరం కమిషన్‌కు వచ్చిన ఆయన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లంపల్లి ఎత్తులో ఉంది కాబట్టి అక్కడికి నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రతిపాదించారని ఆయన తెలిపారు.
తుమ్మిడిహెట్టి దగ్గర ఎల్లంపల్లి ఎత్తులోనే ఉంటుంది.. తక్కువ లిఫ్టింగ్‌తో ఎత్తిపోయొచ్చని ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కృష్ణా జలాల గురించి ఆలోచించి ప్రాణహితను పక్కనపెట్టారని తెలిపారు. ఆ తర్వాత రాష్ర్టం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టిందన్నారు. ఇంజనీరింగ్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆ ప్రజెక్ట్ కరెక్ట్ కాదని తేల్చి చెప్పినా, తొందరపాటుతో ప్రాజెక్ట్‌ను చేపట్టారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద సమస్య ఏంటంటే ప్రవహించే నీళ్లను ఎత్తిపోయలేమన్నారు. అందుకే బరాజ్‌లు నిర్మించి తర్వాత స్టోరేజీ కోసం డ్యాములుగా మార్చారని తెలిపారు. ఫలితంగా బరాజ్‌లు కుంగాయని తెలిపారు. విపరీతమైన వడ్డీతో అప్పులు తెచ్చారని, రాష్ర్టంపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు.
డిజైన్లలో లోపం ఉందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని, అయితే బాగా డబ్బులున్న కాంట్రాక్టర్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం డబ్బులను వెదజల్లిందన్నారు. కనీసం 90 టీఎంసీల నీటిని కూడా తోడుకోలేకపోయామని కోట్లాది సొమ్ము ఏటి పాలయిందన్నారు. తుమ్మిడిహెట్టి కింద ఆరు కిలోమీటర్ల కిందకు వస్తే గట్టి రాయి ఉందని... పునాది గట్టిగా ఉంటుందన్నారు. అక్కడైతే బరాజ్ పటిష్టంగా నిలబడుతుందన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టాలని కమిషన్‌కు చెప్పినట్లు ఆయన వివరించారు. అలాగైతేనే ఇప్పుడున్న రిజర్వాయర్లను వాడలేమన్నారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని, పనికిరాని స్థలంలో బరాజ్ కట్టారని అన్నారు. దానిలో డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు ఉన్నాయన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేయాలనే డిమాండ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నామని ఆయన తెలిపారు.






