6 May, 2026 | 3:54 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి

06-05-2026 02:24 AM

చర్ల పర్యటనలో జిల్లా కలెక్టర్ అంకిత్

చర్ల, మే 5, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. చర్ల మండలంలో  ఆయన మంగళవారం విస్తృత పర్యటన నిర్వహించారు.

ఈ సందర్భంగా భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లిముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ టార్పాలిన్లు, హమాలీలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు.  కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సత్యనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.  చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు.

మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంటగది, అవుట్ పేషెంట్ విభాగం తదితర విభాగాలను సందర్శించి సేవల నాణ్యతను తనిఖీ చేశారు. తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏ ఈ ముకేశ్, ఏ ఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈ లు అరుణ్,రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ సాయి వర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ , ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.