27 July, 2026 | 2:26 AM

పంజాబ్.. మత్తుకు బానిస

30-05-2024 12:48 AM

డ్రగ్స్ సమస్యలపై రాహుల్ గాంధీ ధ్వజం

ఇంకా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోందని ఆగ్రహం

పంజాబ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయి

బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు.. అంబానీ, అదానీల కోసమే

ఛండీగఢ్, మే 29: పంజాబ్‌ను ఇంకా డ్రగ్ పెనుభూతం పట్టిపీడిస్తోందని, ఇంకా అది పెరుగుతూనే ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పంజాబ్‌లో డ్రగ్స్ అంశాన్ని ఇటీవలే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేవనెత్తారు. బుధవారం పంజా బ్‌లోని లుధియానాలో పార్టీ అభ్యర్థి అమరీందర్ సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కాగా, డ్రగ్స్ కారణంగా పంజాబ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతోందని దుయ్యబట్టారు. డ్రగ్స్‌కు భయపడి రైతులు తమ భూములను అమ్ముకుని, వారి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత పంజాబ్ నుంచి వలస పోతున్నారని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వా మ్యం కాగా, పంజాబ్‌లో మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. పైగా ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ ఉండటం గమనార్హం. 

ప్రజల గొంతుక.. 

రాజ్యాంగం అనేది ఒక పుస్తకం మాత్రమే కాదని, ఇది ప్రజల గొంతుక అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని, చెత్త బుట్టలో వేస్తామని ఆ పార్టీ నేతలు అన్నారని గుర్తు చేశారు. ‘రిజర్వేషన్లు కావచ్చు.. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు.. పేదల హక్కులు కావచ్చు.. అన్నీ రాజ్యాంగం నుంచి వచ్చినవే.. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ అంతం చేయాలని చూస్తోంది’ అని రాహుల్ దుయ్యబట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చామన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. ‘జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టారని, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలను నాశనం చేశారని, ఇదంతా కూడా అదానీ, అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే’ ఇలా చేశారు’ అని విరుచుకుపడ్డారు.

అగ్ని పథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దేశ సైనికులను అవమానించిందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం.. సైనికులను కూడా విభజించిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని బుట్టదాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. నల్ల చట్టాల ద్వారా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారని, మోదీ పాలసీలు వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులకు ఏమీ లబ్ధి చేకూర్చలేదని, దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయని మండిపడ్డారు. 22 మంది అరబ్‌పతీలకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, సంస్థలు, సోలార్ పవర్, రక్షణ సంస్థలు అదానీ వంటి వారికి కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.