27 July, 2026 | 1:15 AM

రూ.17 వేల కోట్లు ప్రజలకిచ్చాం

30-05-2024 12:52 AM

అవినీతి సొమ్మును తిరిగిచ్చేశాం

బెంగాల్‌లోనూ రూ.3 వేల కోట్లు ఇస్తాం

నేను తినను.. ఎవరినీ తిననివ్వను

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 

కోల్‌కతా, మే 29: భారత్‌లో జరిగిన కుంభకోణాల్లో స్వాధీనం చేసుకున్న రూ.17,000 కోట్లను దేశవ్యాప్తంగా ప్రజలకు విజయవంతంగా పంచామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం చేసిన రూ.3 వేల కోట్ల అవినీతి సొమ్మును తిరిగి రాష్ట్ర ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చారు. బరాసత్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్‌లో జరిగిన రోడ్ షోలో మోదీ మాట్లాడుతూ.. అవినీతిదారుల నుంచి డబ్బు లాక్కొని మోసపోయినవారికి తిరిగి ఇస్తానని ఉద్ఘాటించారు. నేను అవినీతి చేయను. ఎవరినీ చేయనివ్వను.

తన బుజ్జగింపు రాజకీయాల కోసం రామకృష్ణ మిషన్, ఇస్కాన్, భారత్ సేవాశ్రమ్ సంఘ సాధువులను టీఎంసీ అవమానించింది. ఆ సంస్థలపై టీఎంసీ గూండాలు దాడులు చేశారు అని ఆరోపించారు. అనంతరం కాకాద్వీప్ ప్రచార సభలో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ.. ముస్లింలను ఓబీసీల్లో చేర్చి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిందని టీఎంసీపై మండిపడ్డారు. కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు దళితులకు, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగంపై బహిరంగంగా దాడి చేశారని ఆరోపించారు. కలకత్తా హైకోర్టు ఈ సర్టిఫికెట్లను రద్దు చేసినా టీఎంసీ ప్రభుత్వం తీర్పును అంగీకరించలేదని గుర్తు చేశారు. 

అక్రమ వలసలకు ప్రోత్సాహం..

మత్స్యకారుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను బెంగాల్ రాష్ట్రం అమలు చేయడం లేదని మోదీ ఆరోపించారు. ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల అమలును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. బెంగాల్‌లోకి అక్రమ వలసలను అడ్డుకోకుండా జాతీయ భద్రతకు టీఎంసీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని దుయ్యబట్టారు. టీఎంసీ, ఇండియా కూటమి బెంగాల్ అభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తున్నాయన్నారు. పీఎం అవాస్ యోజన, మధ్యా హ్న భోజన పథకాల్లో బెంగాల్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నట్లు పేర్కన్నారు. వికసిత్ భారత్ సాధ్యం కావాలంటే ముందుగా బెంగాల్‌లో వికాసం రావాలని మోదీ అభిప్రాయపడ్డారు. అనంతరం జార్ఖండ్‌లోని దుమకాలో జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలోని ప్రభుత్వం గత ఐదేళ్లలో అవినీతి, అక్రమ సంపాదనకు రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా మార్చారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తి కాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.