ఈ ఎన్నికలు మనకో అవకాశం

08-05-2024 02:11:22 AM

ప్రజాస్వామ్యం,రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

పార్టీ కార్యకర్తలకు రాహుల్‌గాంధీ బహిరంగ లేఖ 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికలు సాధారణమైనవి కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకునే అవకాశమని పేర్కొన్నారు. ఒక వైపు ప్రేమ, న్యాయం అనే కాంగ్రెస్ భావజాలం, మరో వైపు మోదీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భయం, దేషం, విభజన భావజాలం మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ‘ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి మీలాంటి నమ్మకమైన కార్యకర్తలే పెద్ద బలం. కాంగ్రెస్ సిద్ధాంతం మీ హృదయాల్లో, మీ చర్యలలో ఉంది. మీకు భయం లేదు. పార్టీకి ప్రతి కార్యకర్త  వెన్నెముక. మీరు లేకుండా మేం గెలవలేం. ఇప్పటివరకు మీరు చేసిన కృషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీవల్లే విప్లవాత్మకమైన మ్యానిఫెస్టోను రూపొందించగలిగాం. రెండు దశల ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలను అడ్డుకోగలిగాం. ఇప్పుడు మరో నెల పాటు కష్టపడాల్సిన సమయం వచ్చింది. మా హామీ ప్రతి భారతీయుడికి చేరేలా, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి బయటకు వచ్చేలా చూడాలి. మనందరం కాంగ్రెస్ సందేశాన్ని, మనమిచ్చిన హామీలను ప్రతి గ్రామం, ప్రాంతం, వీధి, ఇంటికి తీసుకుకెళదాం. బీజేపీ భావజాలం, వారి విద్వేషపూరిత అజెండా వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలి. ఈ పోరాటంలో నేను చేయగలిగనదంతా చేస్తున్నాను. నేను మిమ్మల్నీ అదే అడుగుతున్నా’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.