పైసా పెట్టకుండా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా

08-05-2024 02:26:54 AM

మొదటిసారి రూ.18వేల ఖర్చు

అవి కూడా మర్రి చెన్నారెడ్డి ఇచ్చినవే

నాడు సేవ చేసేవాళ్లనే ప్రజలు ఎన్నుకునేవారు

నేడు పైసలిచ్చే నాయకులకే ఓట్లు వేస్తున్నారు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే  కొమ్మిడి నర్సింహారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 7 (విజయక్రాంతి): నేటి రోజుల్లో వార్డు నెంబర్‌గా గెలిచేందుకే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిచేందుకు రూ.కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇక ఎమ్మెల్యే, ఎంపీ విషయానికి వస్తే హద్దే లేకుండా పోయింది. కానీ ఓ నాయకుడు నయా పైసా ఖర్చు పెట్టకుండా రెండు సార్లు సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా గెలిచారు. కేవలం రూ.18 వేలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అవి కూడా ఆయన డబ్బులు (అవి కూడా చెన్నారెడ్డి  ఇచ్చారు) కాదు. పైసలు పంచి కాదు ప్రజలు మద్దతుతోనే గెలిచానని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి. సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా, టాకా అధ్యక్షుడిగా, రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అయనకు సొంత ఇల్లు కూడా లేదు. గ్రామంలో తన వాటాగా వచ్చిన భూమిని భూమిలేని పేదలకు ఉచితంగా పంచారు. నేటికీ అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. వయసు పెరుగుతున్నా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రసుత్తం యాదాద్రి భువనగిరి జిల్లా) బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డిని ‘విజయక్రాంతి’ ప్రతినిధి పలుకరించగా నాటి, నేటి ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే..

ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు...

రాజకీయాల్లోకి రావడానికి ముందు యువజన సంఘాలు పెట్టి సేవా కార్యక్రమాలు చేశాను. ప్రజల ఆదరణతో 1962 మధ్యకాలంలో సర్పంచ్‌గా పని చేశాను. రెండు దఫాలుగా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. అనంతరం ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే భువనగిరి సమితి ప్రెసిడెంట్‌గానూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. బొల్లెపల్లి గ్రామానికి చెందిన పెద్ద మనిషి వాసుదేవరెడ్డి కోరిక మేరకు ఓటర్లకు భోజనం పెట్టించాను. అప్పుడు నాకు వచ్చే గౌరవ వేతనం వంద రూపాయలు. ఇందులో నుంచి ఓ ఇరవై రూపాయలతో భువనగిరిలో గది అద్దెకు తీసుకుని సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశాను. 

చెన్నారెడ్డి పిలిచి టికెట్ ఇచ్చారు...

సమితి ప్రెసిడెంట్ పదవీకాలం ముగిసిన తర్వాత తాలుకా అగ్రికల్చర్ కమిటీ అథారిటీ (టాకా)గా చైర్మన్‌గా పని చేశాను.  నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు. ఓ రోజు మర్రి చెన్నారెడ్డి నుంచి పిలుపు వస్తే హైదరాబాద్ వెళ్లాను. నన్ను, నా నిస్వార్థ సేవలను గుర్తించిన ఆయన భువనగిరి ఎమ్మల్యేగా పోటీ చేస్తావా అని అడిగారు. నేను అశ్చర్య పోయాను. అప్పటికే రెడ్డి కాంగ్రెస్ (ఆవు దూడ గుర్తు) అభ్యర్థిగా కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరి బరిలో ఉన్నారు. సమాజంలో పెద్ద నాయకుడిగా పేరున్న ఆయనపై నేను గెలుస్తానా అని అంటుండగానే భువనగిరి ఎమ్మెల్యే టికెట్ నీకే అన్నారు. 

డబ్బులు లేక పోటీ చేయలేదు..

1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. కానీ నా దగ్గర డబ్బులు లేక నేను పోటీ చేయలేదు. ఎన్‌టీ రామారావు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నా దగ్గరకు పంపారు. పార్టీలోకి రమ్మన్నారు. కానీ నేను చెన్నారెడ్డి మనిషిని.. రాలేను అని చెప్పాను. రామారావు స్వయం గా మాట్లాడి భువనగిరిలో నీవు పోటీ చేస్తే నే ను సపోర్టు చేస్తాను అన్నారు. కానీ మీరు మా నాయకుడు చెన్నారెడ్డిని కరీంనగర్ ఎంపీగా ఓడగొట్టారని, అవసరం లేదని చెప్పాను. నాదేండ్ల భాస్కర్‌రావుతో వివాదం నడుస్తున్న సమయంలో ఓ ఎమ్మెల్యే రామారావుపై దాడి చేసేందుకు చెక్కతో విసిరాడు. అది రామారావుకు కాకుండా నాకు తగిలింది.  అందుకే నాపై రామారావుకు అభిమానం ఉండేది. 

అప్పుడు ప్రజాసేవకు ఆస్తులు అమ్మారు... నేడు..!

ప్రజలు మారాలి. ఒకప్పుడు ప్రజలు చందాలు ఇచ్చి, ప్రచారం చేసి, అన్నం పెట్టి వాళ్లకు కావాల్సిన నాయకులను ఎన్నుకునేవారు. కానీ నేడు పైసలు ఇచ్చిన అభ్యర్థికే ఓట్లు వేస్తున్నారు. ఒకప్పుడు ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ నేడు ఆస్తులు కూడబెట్టడానికే వస్తున్నారు. నేడు రాజకీయ నాయకులు వార్డుమెంబర్‌గా పోటి చేసేందుకే లక్షలు ఖర్చు చేస్తున్నారు. గెలిచాక కోట్లు వెనకేస్తున్నారు. సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఇక చెప్పనక్కరలేదు. ఎలాగైనా గెలవాలని కోట్ల రూపాయలను పంచి పెడుతున్నారు. గెలిచిన తర్వాత పది తరాలు కూర్చొని తిన్నా ఒడవని సంపద పోగేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. 

ఎన్నికల ఖర్చు రూ.18 వేలు 

1978లో బీఫాంతో పాటు రూ.18వేలను చెన్నారెడ్డి నా చేతిలో పెట్టారు. అలాగే అలేరు అభ్యర్థిగా ఎవ్వరిని పెట్టాలో నీవే డిసైడ్ చెయ్ అన్నారు. ఎవ్వరిని ఎంపిక చేయాలని రాయగిరిలో రోడ్డు పక్కన కూర్చొని ఒకరిద్దరు సర్పంచ్‌లను పిలుచుకొని మాట్లాడుతుండగా, అలేరు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న చల్లూరు పోషయ్య అనే యువకుడు వచ్చి నాకు టికెట్ ఇస్తారా అన్నారు. వెంటనే చెన్నారెడ్డికి చెప్పి ఇద్దరం కలిసి ఒకేసారి నామినేషన్ వేశాము. మా నామినేషన్ చెల్లకుండా చేయాలని నాటి ఎమ్మెల్యే పొన్నారెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కానీ నిజాయితీగల అధికారులు ఆయన మాటలు వినలేదు. మా నామినేషన్‌ను అంగీకరించారు.

చెన్నారెడ్డి పోషయ్యకు బీఫాంతో పాటు రూ.30వేలు ఇచ్చారు. రఘునాథపురం గ్రామంలోని వీవర్స్ సొసైటీ సభ్యులు, ప్రజలు పోషయ్య ప్రచారం కోసం ఓ జీపు మాట్లాడి ఆ జీపు ఖర్చులు వాళ్లే పెట్టుకున్నారు. అప్పటికే బలమైన నాయకుడిగా ఉన్న పొన్నారెడ్డిపై పోషయ్య 42వేల మెజార్టీతో విజయం సాధించగా, కొండా లక్ష్మణ్ బాపూజీపై నేను 3౦వేల మెజార్టీతో గెలిచాను. మా గెలుపు కోసం ప్రజలే ముందు నడిచారు. జలాల్‌పురం గ్రామంలో ప్రచారం చేసేందుకు వెళితే.. గ్రామ దొరలు నన్ను రానివ్వలేదు. కానీ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు నా వద్దకు వచ్చి దొరలను అడ్డుకొని నాతో ప్రచారం చేయించారు. అనంతరం 1982లో రామారావు టీడీపీ పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించారు. అయినా నేను 1983లోను భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఆ ఎన్నికల ఖర్చుల కోసం రాజీవ్‌గాంధీ రూ.1.75లక్షలు ఇచ్చారు. అప్పుడు ప్రజలే ముందు నడిచి నచ్చిన నాయకుడిని నయా పైసా తీసుకోకుండానే ఓటు వేసి గెలిపించేవారు.