20-08-2025 01:12:04 AM
స్థలాన్ని పరిశీలించిన రైల్వే, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు
మహబూబాబాద్,(విజయక్రాంతి): కాజీపేట-డోర్నకల్ రైల్వే సెక్షన్ లో కేసముద్రం రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా మంజూరైన అండర్ రైల్వే బ్రిడ్జి (ఆర్ యు బి) నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆర్ యు బి నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని మంగళవారం రైల్వే సినియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఏఈ ప్రశాంత్ తో పాటు మున్సిపల్ అధికారులు ప్రతిపాదిత మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇంతకు ముందు ఉన్న పాత రైల్వే గేట్ స్థానంలోనే ఆర్యుబి నిర్మాణం చేస్తారని, ట్రాక్ ఇరువైపులా 5 మీటర్ల వరకు గడ్డర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిదంగా అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని బట్టి ఇరువైపులా ( అంబేద్కర్, అమరవీరుల స్తూపం) సుమారు 50 మీటర్ల వరకు సైడ్ వాల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అండర్ బ్రిడ్జ్ కోసం 10/10 ఫిట్ల గడ్డర్స్ ( బాక్స్ ) పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల అనంతరం ఉన్నతధికారులు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని, వర్షాల నేపథ్యంలో ఆర్యుబి పనులు ఆలస్యం అయ్యాయని, వర్షాలు తగ్గు ముఖం పట్టగానే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.