calender_icon.png 20 August, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోర్నకల్‌లో కలెక్టర్ తనిఖీలు

20-08-2025 01:12:19 AM

గార్ల, ఆగస్టు 19 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాల, ఫర్టిలైజర్ షాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు.

పాఠశాల పరిసరాలు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా శానిటేషన్ నిర్వహించాలన్నారు. ఎరువుల షాపులో తనిఖీలు నిర్వహించి యూరియా కృత్రిమ కొరత సృష్టించవద్దని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మకాలు జరపాలని, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాకాలం వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, తహసిల్దార్ ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.