24 June, 2026 | 2:38 AM

వరుణుడి కరుణ.. రైతుల్లో కొత్త ఆశలు

24-06-2026 01:42 AM
  1. ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసిన వానలు
  2. జిల్లాలో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం
  3. పొలాల్లో పెరిగిన తేమ.. అన్నదాతల్లో ఆనందం

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయ క్రాంతి):గత రెండు వారాలుగా ఆకా శం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతాంగంపై వరుణుడు కరుణించాడు. సోమవా రం , మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊపిరి పోశాయి. విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు తాజాగా కురిసిన వానలతో ఊరట చెందుతున్నారు. కొన్ని రో జులుగా ఎండల కారణంగా మొలకలు దెబ్బతింటాయేమోనన్న ఆందోళనలో ఉన్న రైతు లు ఇప్పుడు పంటలపై ఆశలు పెంచుకున్నారు.

జిల్లాలో పత్తి, సోయాబీన్, మొక్కజొ న్న, కందులు, పెసర్లు సాగు విస్తృతంగా జరుగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. అయితే వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తి నవి ఎండిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో జిల్లాలో కురిసిన వర్షాలు రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చాయి. పొలాల్లో తేమ శాతం పెరగడంతో విత్తనాల మొలకలు మెరుగుపడే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే మొలకెత్తిన పత్తి, సోయాబీన్ పంటలు సైతం తిరిగి కోలుకునే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పొలాలను సందర్శిస్తూ పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం ప్రకారం తిర్యాణి మండలంలో అత్యధికంగా 79.4 మిల్లీమీటర్లు, కౌటాలలో 75.6 మిల్లీమీటర్లు, సిర్పూర్ (యూ)లో 65.2 మిల్లీమీటర్లు, జైనూర్లో 64 మిల్లీమీటర్లు, చింతలమానేపల్లిలో 62.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 41.7 మిల్లీమీటర్లుగా నమోదైంది.వర్షాలు కురవాలని జిల్లాలోని అనేక గ్రామాల్లో రైతులు, మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో కప్పతల్లి పూజలు, వరుణ యాగాలు నిర్వహించారు.

పంటలు బాగా పండాలని, చెరువులు నిండాలని ప్రార్థనలు చేశారు. తాజాగా కురిసిన వర్షాలతో గ్రామాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.ఇంకా రెండు మూడు మంచి వర్షాలు పడితే ఖరీఫ్ పంటలు పూర్తిగా గట్టెక్కుతాయి అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షం పంటలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ రానున్న రోజుల్లో కూడా సాధారణ వర్షపాతం కొనసాగితేనే దిగుబడులపై సానుకూల ప్రభావం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.ఆలస్యంగా అయినా కురిసిన ఈ వర్షం జిల్లాలోని రైతాంగానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఖరీఫ్ సాగు గాడిన పడి, ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.