calender_icon.png 16 February, 2026 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రామలింగేశ్వర స్వామి కల్యాణం

16-02-2026 12:00:00 AM

సిరికొండ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు, హోమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం నెలకొల్పారు.

పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ క్షేత్రాన్ని పుణ్యస్థలంగా తీర్చిదిద్దినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అందువల్ల ఈ దేవాలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి పర్వదినం ఉదయం మొదలుకొని భక్తులు పోటెత్తారు. క్షేత్ర పరిసరాల్లో అల్లుబండ, పవిత్ర కోనేరు, రాములవారి పాదాలు, తేనెతెట్టు వృక్షాలు వంటి పుణ్యచిహ్నాలు ఉన్నాయని చెబుతారు.

మహా శివరాత్రి సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయని కమిటీ సభ్యు లు తెలిపారు. తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.

రాత్రి సమయంలో మహా శివరాత్రి నిశి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చే సింది. భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.