17-12-2025 02:01:34 PM
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో ఇటీవల జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో హైదరాబాద్ వ్యక్తి ప్రమేయం ఉండటం భారతదేశానికి అవమానమే కాకుండా, తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళన కూడా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించగా, ఆ ఘటనలోని అనుమానితులలో ఒకరైన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ అని తెలంగాణ పోలీసులు తెలిపారు. అక్రమ్ ఏ పరిస్థితులలో భారతదేశాన్ని విడిచి వెళ్ళాడు. ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత అతను ఎవరితో సంబంధాలు కొనసాగించాడనే విషయాలపై విచారణ జరపాలని బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ పోలీసులను కోరారు.
ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద చర్యతో హైదరాబాద్‌కు సంబంధం ఉండటం మనకు అవమానకరమైన విషయమే అయినప్పటికీ, ఇది ఒక తీవ్రమైన జాతీయ భద్రతా ఆందోళన కూడా. తెలంగాణ పోలీసులు ఇప్పుడు విచారణ జరిపి, అక్రమ్ భారతదేశాన్ని విడిచి వెళ్ళిన పరిస్థితులు, కారణాల గురించి కూడా లోతుగా దర్యాప్తు చేయాలని రాంచందర్ రావు సూచించారు. ఈ సంఘటన దేశం, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసు విచారణ అవసరం కావచ్చని ఆయన అన్నారు.
దురదృష్టవశాత్తు, ఈ ఘటనలో పాలుపంచుకున్న వ్యక్తులు భారతదేశానికి చెందినవారు, అందులోనూ హైదరాబాద్ వాసులు. వారు 27 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి వెళ్లిపోయినప్పటికీ, హైదరాబాద్‌లో ఇప్పటికీ ఐఎస్‌ఐ, ఐసిస్ కోసం అనేక స్లీపర్ సెల్స్ ఉన్నాయని తను భావిస్తున్నట్లు రాంచదర్ తెలిపారు. సాజిద్ అక్రమ్ (50) స్వస్థలం భారతదేశంలోని హైదరాబాద్. అతను హైదరాబాద్‌లో తన బీ.కామ్ డిగ్రీని పూర్తి చేసి, సుమారు 27 సంవత్సరాల క్రితం, 1998 నవంబర్‌లో ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని తెలంగాణ పోలీసులు తెలిపారు. కాల్చి చంపబడిన అక్రమ్ వద్ద ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ ఉంది.