01-10-2025 01:16:44 AM
సమస్యల పరిష్కారానికి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హామీ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1 నుంచి సమ్మెకు దిగాలని రేషన్ డీలర్లు నిర్ణయించగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్లు తమ సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. రేషన్ డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రేషన్ సరఫరా చేయలేమని డీలర్లు తేల్చి చెప్పారు.
దీంతో కొత్తగా సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌గా నియామకమైన స్టీఫెన్ రవీంద్ర డీలర్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఒక బ్యాగ్ 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తే .. తమ వద్దకు వచ్చేవరకు బ్యాగులకు చిల్లులు పడి లేదా ఇతర కారణాలతో కిలో, రెండు కిలోల తక్కువగా వస్తున్నాయని, అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు స్టాక్‌లో తేడా వస్తుందని, దీంతో కేసులు నమోదు చేస్తున్నారని కమిషనర్‌కు రేషన్ డీలర్లు వివరించారు.
వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల ముందు డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, కమీషన్ రూ.300 ఇస్తామన్న హామీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీటితో పాటు రూ.2.10 లక్షల వరకు ఇన్స్‌రెన్స్, ఈ నుంచి ఒక శాతం తరుగు, దిగుమతి హామీ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు.
వేబిల్టీ పెంచడంతో పాటు రేషన్ పంపిణీ ముగింపు కాగానే ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే వారం లో మార్జిన్ మొత్తం విడుదల చేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు, నాయకులు పారేపల్లి నాగరాజు, అవుల సం జీవరెడ్డి తదితరులు ఉన్నారు.