calender_icon.png 17 July, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవితేజకు పితృవియోగం

17-07-2025 12:09:05 AM

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరో రవితేజకు పితృవియో గం కలిగింది. ఆయన తండ్రి భూపతి రాజు రాజగోపాల్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజగోపాల్‌రాజు హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట గ్రామ వాస్తవ్యుడైన రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మాసిస్టు. రాజగోపాల్‌కు ముగ్గురు సంతానం కాగా.. రవితేజ మొదటి కుమారుడు.

రెండో కొడుకు భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న కుమారుడు రఘు పలు సినిమాల్లో నటించారు. పలువురు సినీప్రముఖులు రాజగోపాల్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. చిరంజీవి స్పందిస్తూ.. “సోదరుడు రవితేజ తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ను చివరిసారి ‘వాల్తేరు వీరయ్య’ సెట్లో కలిశాను” అన్నారు. నటులు బాలకృష్ణ, వెంకటేశ్, పవన్‌కల్యాణ్, శ్రీవిష్ణు, దర్శకులు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్‌కేఎన్ తదితరులు సానుభూతి ప్రకటించారు. 

రెండ్రోజుల వ్యవధిలో రీల్ ఫాదర్.. రియల్ ఫాదర్ దూరం 

రవితేజ రెండు రోజుల వ్యవధిలోనే తన రీల్ ఫాదర్‌ను, రియల్ ఫాదర్‌ను కోల్పోయారు. ఈ వరుస ఘటన యాదృచికమే అయినా, ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యాయి. రవితేజ రీల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు ఈ నెల 13న మృతిచెందిన సంగతి తెలిసిందే. ‘ఇడియట్’ సినిమాలో తండ్రీకొడుకులుగా కోట, రవితేజ మధ్య సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. అలా కోటతో అంతటి అనుబంధం ఏర్పర్చుకున్న రవితేజ.. ఆ విలక్షణ నటుడిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోక ముందే ఇప్పుడు సొంత తండ్రిని పోగొట్టుకున్నారు.