11 April, 2026 | 2:05 AM

రేజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

11-04-2026 12:00 AM

దర్శకుడు రవిబాబు నుంచి వస్తున్న కొత్త సినిమా ‘రేజర్’. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసిందీ చిత్రం. ముఖ్యంగా టైటిల్ వీడియో, విజువల్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తిచేశారు. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకొని, ప్రస్తుతం ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉంది. ఈ నేపథ్యం లో చిత్రబృందం తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

అర్బన్, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య ఇంటెన్స్ పవర్‌ఫుల్‌గా కనిపించిన రవిబాబు లుక్ ఆకట్టుకుంది. మే 8న ఈ సినిమా విడుదల కానుందని రవిబాబు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఆయన రచన, దర్శకత్వంతోపాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.