కార్యసాధనకు సన్నద్ధత
మంత్రశక్తిః శ్రేయసీ
ప్రజ్ఞాశాస్త్ర చక్షుర్షి రాజా
అల్పేనాపి ప్రయత్నేన
మంత్రమాధాతుం శక్తః
కౌటిలీయం (9
“ప్రభావ- మంత్రశక్తులలో ప్రభావం గొప్పదన్న” వారి వాదనను ఖండిస్తూ ఆచార్య చాణక్య, “మంత్రశక్తియే ఉత్తమమైంది” అంటారు. ప్రభావం అంటే కోశం, సైనికబల సమృద్ధి. మంత్రశక్తి అంటే ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లేదా నైపుణ్యం. ప్రజ్ఞ అంటే బుద్ధిబలం. శాస్త్రం అంటే విజ్ఞానం.
ప్రజ్ఞా విజ్ఞానాలు రెండూ.. రెండు కళ్లుగా కలిగిన నాయకుడు కొద్ది ప్రయత్నంతోనూ ఉత్సా హం, ప్రభావం కలిగిన వారిపై విజయం సాధించగలుగుతాడు. ఉత్సాహవంతునికన్నా ప్రభావం కలిగినవాడు, ఈ ఇరువురి కన్నా మంత్రశక్తి కలిగినవాడు గొప్పవాడని చాణక్యుల అభిప్రాయం.
విజయ సాధనకు అంగబలం, అర్థబలం అవసరమనేది కొంతవరకు యదార్థమే అయినా అన్ని సమయాలలో అది సత్ఫలితాలను ఇవ్వలేదు. సరైన విధానంలో ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోవడం వాటిని సమర్థవంతంగా అమలుచేయడం వల్ల విజయాన్ని సాధించడం సులువవుతుంది.
దానినే ‘మంత్రశక్తి’గా భావించవచ్చు. అయితే, ప్రజ్ఞా పాటవాలు, విజ్ఞానం, ప్రభావం, మంత్రశక్తి ఇవన్నీ విజయసాధనకు ఉపకరణాలే కాని, ఇవన్నీ జన్మతః రావాలని కొందరి అభిప్రాయం. అది నిజ మా? అంటే కాదని విజయసాధకుల జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. నిరంతర అభ్యాసమే వారిని ఉన్నత శిఖరాలపైకి చేరుస్తుంది.
ఎరిక్సన్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు, లెనిటన్ లాంటి న్యూరాలజిస్టులు తమ రంగాలలో ప్రపంచస్థాయి నైపుణ్యా లను సాధించి ఉన్నత స్థానాన్ని పొందాలంటే దాదాపు 10,000 గంటల అభ్యాసం అవసరమని అంటారు. రోజుకు 7 గంటల చొప్పున సంవత్సరం లో కనీసం 360 రోజులు, ఇలా నాలుగేళ్లు కష్టపడితేనే పరిణతి సాధ్యమవుతుంది.
అంతటి నిష్ఠను సాధించడం సాధ్యమే. ఏకాగ్రతతో వయోలిన్ నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిన కొందరు విద్యార్థులను చాలాకాలం పరీక్షించిన మానసిక శాస్త్రజ్ఞుల బృందం, వారి పరిణతిని మూడు విభాగాలుగా గుర్తించింది.
అత్యుత్తమ పరిణతిని సాధిం చిన విద్యార్థులు 10,000 గంటలకుపైగా అభ్యాసం చేస్తే ఉత్తమ పరిణతిని సాధించిన విద్యార్థులు 8,000 గంటల అభ్యాసం చేసారట. దాదాపుగా 5,000 గంటల అభ్యాసం చేసిన వారి పరిణతి సాధారణ స్థాయిలో నిలిచిపోయి పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారట.
పరిణతి సాధించేందు కు ఇంత సమయం అవసరమా అంటే, విలువల ను, తారతమ్య నిరూపణ పద్ధతిని గ్రహించగలిగిన మానసిక స్థితిని పొంది,
అనవసరమైన విషయాలను మనసులోంచి తొలగించుకొని, సంబంధిత విషయాలన్నింటినీ ఒక్క దగ్గర సమకూర్చుకొని, ప్రభావవంతమైన పాండిత్యాన్ని లేదా ప్రతిభా నైపుణ్యాలను సంతరించుకునేందుకు మెదడుకు అంత సమయం అవసరమవుతుందని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
అంతటి కఠోర పరిశ్రమ చేస్తేనే, ఉన్నత స్థానాన్ని చేరుకుంటారని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. నిజానికి అభ్యాసం అనేది ఒక రంగంలో పరిణతి సాధించాక చేసేది కాదు, పరిణతి సాధించే విధంగా వ్యక్తిని తీర్చిదిద్దేదే అభ్యాసం.
సంస్థ సుస్థిరాభివృద్ధి ముఖ్యం
విజయ సాధనలో ప్రతిభా వ్యుత్పత్తులతోపాటు గా సన్నద్ధత కూడా అవసరమే. అయితే వాటి భాగస్వామ్యం సన్నద్ధత కన్నా చిన్నదని యాజమాన్య నిర్వాహకుల అభిప్రాయం. ప్రతిభా వ్యుత్పత్తులు ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ఉపకరిస్తాయి.
సన్నద్ధత ఎదురయ్యే సమస్యలను ముందు గానే గ్రహించి అవసరమైన ముందస్తు చర్యలను చేపడుతుంది. దానితో సమయం ఆదా అవడమే కాక ఒత్తిడి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వల్ల సన్నద్ధత అలవడుతుంది. సన్నద్ధత సృజనాత్మకతకు మార్గం చూపుతుంది.
సృజనాత్మకత అంటే కొత్త ప్రయోగాలు చేయడం, ఉన్న వాటిని ఆధునీకరించడం, పాత కొత్తలను జత చేయడం లేదా మార్చడం కావచ్చు. ఇలా సృజనాత్మకతకు అనేక పార్శ్వాలు ఉంటాయి. నాయకుడు తన బృందంలోని సభ్యులలో ఎవరికి ఏ విషయంలో ఆసక్తి ఉం దో పసిగట్టి, అతడి ప్రతిభను ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతాయి.
ఐన్‌స్టీన్ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. కాని, గణితం, భౌతికశాస్త్రాలలో అతడు చూపిన అత్యున్నత ప్రతిభను గుర్తించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రవేశ పరీక్ష లేకుండానే అతనికి ప్రవేశాన్ని కల్పించాడు. ఫలితంగా, ఐన్‌స్టీన్ సృజనాత్మకతను ప్రపం చం ఆస్వాదించగలిగింది.
ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి సృజనాత్మకతను సంతరించుకోవడం ద్వారా వస్తుంది. నిశిత పరిశీలన వల్ల ఇది సాధ్యమవుతుంది. సృజనాత్మకత ప్రయోగశీలతను స్వాగతిస్తుంది. దానివల్ల అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుంది.
దానికి చొరవ కలిగిన, నిజాయితీతో కూడిన నాయకత్వం లభిస్తే సమర్థవంతమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందుతాయి. వాటిని అమలు చేస్తూ నిర్దిష్ట కాలవ్యవధిలో, తక్కువ వనరులతో ఉత్పత్తిని సాధించి, వినియోగదారులకు అందచేయడం వల్ల సంస్థ ఆర్థిక స్థితిగతులు ఉన్నతిని సాధిస్తాయి.
సుస్థిర అభివృద్ధిని సాధించిన సంస్థ ఉనికి సుప్రతిష్ఠితమవుతుంది. సంస్థ ఉనికియే ఉద్యోగుల ఉనికికి కారణమవుతుంది. దేశ ప్రగతికి మూలమవుతుంది.
వ్యక్తిలో నిశిత పరిశీలన, సృజనాత్మకత, ప్రయోగశీలత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే సమర్థత, చొరవ, నిజాయితీ, నిరంతర అభ్యాసం వెలుగుచూస్తే సమర్థత కలిగిన నాయకునిగా రూపుదిద్దుకుంటాడు. అతని నాయకత్వం ఉత్తమ ఫలి తాలను అందిస్తుంది.
పాలకుర్తి రామమూర్తి






