1 May, 2026 | 1:55 PM

మూడు దశాబ్దాల పోరాటానికి ఫలితం

05-02-2025 12:00 AM

ఎస్సీ వర్గీకరణలో మరో అడుగు ముందుకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక, సిఫార్సులను వెంటనే కేబినేట్ సబ్ కమి టీ, మంత్రిమండలి ఆమోదించడం పట్ల మాదిగ, మాదిగ ఉపకులాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎస్సీలను ౩ గ్రూపులు గా విభజిస్తూ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపు-1లో అత్యంత వెనకబడిన కులాల ను, గ్రూపు-2లో మాదిగ, మాదిగ ఉపకులాలను, గ్రూపు-3లో మాలలు, మాల ఉపకులాలను చేర్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బీజం

స్వాతంత్య్రానంతరం సమాన అవకాశా లు కల్పించాలనే లక్ష్యంతో దళితులు, గిరిజనులను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించి రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు కల్పించా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 61 కులాలు, ఉపకులాలతో షెడ్యూల్డు క్యాస్ట్‌ను గుర్తించారు. ఎస్సీల్లో మాదిగలు 49.2శాతం, మాలలు 41.6 శాతం ఉన్నారు.

విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లలో  మాలలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారనే వాదనతో మాదిగలు వర్గీకరణ డిమాండ్ లేవనెత్తారు. ఎస్సీలకు కేటాయించిన 15 శాతం రిజర్వేషన్ ఫలాలను దామాషా ప్రకారం పంచిపెట్టాలని 1972 నుంచి వాదిస్తున్నారు. 

ఎంఆర్‌పీఎస్ ఆవిర్భావంతో..

1994లో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావంతో వర్గీకరణ ఉద్యమం ఉద్ధృతమైంది. ఎస్సీ కుల్లాలోని అసమానత కులపరమైంది కాదు, ప్రాంతపరమైనదం టూ పీవీ రావు ఆధ్వర్యంలో మాలమహానాడు కౌంటర్ ఉద్యమం మొదలు పెట్టిం ది.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మాదిగలు ఉండటం, ఉద్యమ నేపథ్యం ఉన్న మంద కృష్ణమాదిగ నేతృత్వంలో జరుగుతున్న పోరాటం అనతికాలంలోనే తారస్థాయికి చేరింది. విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించ డంలో సఫలమయ్యారు.

అన్ని పార్టీల నాయకులను కలిసి తమ ఆకాంక్షను వివరించి సానుకూల నిర్ణయం తీసకోవడానికి కృషి చేశారు. ఫలితంగా వర్గీకరణను సమర్థిస్తూ శాసనసభలో తీర్మానం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను అధ్యయనం చేసేందుకు 1996లో చంద్రబాబు నాయు డు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఎస్సీ కులాల్లోని సామాజిక అసమానతను పరిశీలించి వర్గీకరణకు అనుకూలంగా నివేదికను సమర్పించింది. విద్య, ఉద్యోగా ల్లో మాలలకంటే మాదిగలు చాలా వెనకబడి ఉన్నారని, ఎస్సీలకు దక్కిన ఉద్యో గాల్లో 80 శాతం మాలలు, దాని ఉపకులాలవారు ఉంటే, 20శాతం మాత్రమే మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు ఉన్నారని కమిషన్ తేల్చింది.

అంతేకాకుం డా రాజకీయంగా కూడా మాలలే అత్యధిక లబ్ధి పొందుతున్నారని, ఆనాటి అసెంబ్లీలో 39 మంది ఎమ్మెల్యేలకుగాను 30 మంది మాలలు ఉన్నారని మంద కృష్ణమాదిగ బలమైన వాదన లేవనెత్తారు. దీంతో జనా భా ప్రాతిపదికన ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ముందునుంచీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్న మాలమహా నాడు జీవోను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్సీ వర్గీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించిన అంశమని, రాజ్యాంగ విరుద్ధమని 1997లో హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో వర్గీకరణ అమలు కు ఆదిలోనే హంసపాదు పడింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. జీవో జారీకి ముందు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించలేదన్న అభ్యంత రం వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం కేసు ఉపసహరించుకొని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించింది.

కమిషన్ సలహా మేరకు మరోసారి 2000 సంవత్సరంలో ఎస్సీలను వర్గీకరిస్తూ చేసిన చట్టం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్‌వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యో గాల్లో ఎస్సీ వర్గీకరణ అమలైంది. ఈ కాలంలో దాదాపుగా 22వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కాయని,

ఇలాగే కొనసాగితే సమన్యాయం దక్కేదని మంద కృష్ణమాదిగ అభిప్రాయం. అంతేకాకుండా 45 అసెంబ్లీ స్థానాల్లో సగం సీట్లు మాదిగ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది ఎమ్మార్పీస్ ఉద్యమం సాధించిన విజయమే.

సుప్రీం తీర్పుతో మొదటికి...

ఎస్సీ కులాల జాబితా మార్పు, చేర్పు లు, వర్గీకరణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభు త్వ పరిధిలోకి రావని, రాజ్యాంగ సవరణ అవసరమంటూ సుప్రీంకోర్టు అభ్యంతరం తెలుపుతూ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. దీంతో వర్గీకరణ రణం మళ్లీ మొదటికి వచ్చింది.

మాలలు మాత్రమే కాంగ్రెస్ సానుభూతిపరులుగా భావించి వర్గీకరణ అంశాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పక్కకు పెట్టింది. కానీ అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. రాజ్యాంగ సవరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యమైంది.

దీంతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన అంశాలను అధ్య యనం చేయడానికి ఉషామెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. శాసనసభలో ఏక గ్రీవ తీర్మానం చేస్తే వర్గీకరణను పార్లమెం టు ఆమోదించవచ్చునని, దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలని కిషన్ సిఫా ర్సు చేసింది.

కానీ కమిషన్ నివేదికను కాంగ్రెస్‌ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. దీన్ని గమనించిన బీజేపీ 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ 2019లో రెండోసారి అధికారం చేపట్టినప్పటికీ ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పట్టించుకోలేదు.

కేంద్రమంత్రిగా ఉన్నప్పటినుంచి వెంకయ్యనాయుడు ద్వారా మంద కృష్ణమాది గ తమ వాదనను చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయారు. సానుకూలంగా స్పందించడమే తప్ప పరిష్కారం మాత్రం దక్కలేదు. 

మోదీ చొరవతో..

ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో చేయాలని పోరాటం చేసినప్పటికీ తెలంగా ణ ఉద్యమంలోనూ మంద కృష్ణమాదిగ క్రియాశీల పాత్ర పోషించారు. కానీ సామాజిక తెలంగాణ డిమాండ్ వస్తుందనే భయంతో అగ్రవర్ణాలు పక్కకు నెట్టినప్పటి కీ ఉద్యమాన్ని ఆపలేదు.

ప్రత్యేక రాష్ట్రంలో వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడంవరకే పరిమితమైంది. కిందిస్థాయిలో ఎన్ని పోరాటాలు చేసినా పోరాటంగానే మిగులుతుంది తప్ప ఫలి తం రావడం లేదని గమనించిన మంద కృష్ణమాదిగ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే నే సాధ్యమని బీజేపీతో కలిసి నడిచారు.

పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి తమ ఆకాంక్షను వినిపించారు. ఎస్సీ కులాల్లోని అసమానతలను, వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించి ఓ కమిటీని నియమించి, సుప్రీంకోర్టులో కేసు గెలిచేందుకు కేంద్ర ప్రభు త్వం కృషి చేసింది. 

మూడోసారి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం 30 ఏళ్ల పోరాటానికి మోదీతో ఫలితం దక్కినట్టైంది.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొదటిసారిగా తామే అమలు చేస్తామం టూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. నివేదికను మంత్రివర్గం ఆమోదంతో వర్గీకరణకు మార్గం సుగమం అయింది. 

ఎన్నో ఏళ్లుగా విద్య, ఉద్యోగాల్లో ఏకపక్షంగా లబ్ధి పొందుతున్నందువల్ల వ్యత్యా సం భారీగానే ఉంది. ఇన్నేళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చినందున తక్షణమే విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి అసమానతలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయా లి.  కేంద్ర, ప్రభుత్వ సంస్థల్లో విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో జనాభా ప్రాతిపదికన పంపకాలు జరిగి సమానత్వం రావాలని ఆకాంక్షిద్దాం.

 వ్యాసకర్త సెల్: 9618068673