చర్చకు రెడీ
బీఆర్‌ఎస్ ఆఫీసులోనైనా సిద్ధమే
‘ఈ-కార్’ కేసుపై సీఎం రేవంత్ సవాల్
- పట్టుబడ్డారు కాబట్టే రూ. 55 కోట్లతో ఆగింది
- లేకపోతే రూ.600 కోట్ల కుంభకోణం అయ్యేది
- ఇంతకాలానికి బీఆర్‌ఎస్‌కు ఈ-కార్ గుర్తొంచిందా?
- కొరడా ఝుళిపించండి
- స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ఈ-కార్ రేస్ కేసుపై శాసనసభలో చర్చించేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు సిద్ధంగా లేకపోతే వారి పార్టీ ఆఫీసులో చర్చించేందుకైనా తాము రెడీ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. గురువారం అసెంబ్లీలో భూ భారతి చట్టంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలోని ఏ స్థాయి వ్యక్తి అయినా తమను కలిసే స్వేచ్ఛ కల్పించామని, అందులో భాగంగానే ఈ-కార్ రేసింగ్ సంస్థకు చెందిన వ్యక్తి అపాయింట్‌మెంట్ అడిగితే ఇచ్చినట్టు స్పష్టంచేశారు. ఆ సందర్భంగా వారికి, కేటీఆర్‌కు మధ్య ఉన్న చీకటి ఒప్పందం గురించి వివరించారని, వారు చెబితేనే అసలు వ్యవహారం బయటపడిందన్నారు.
ఆ తర్వాత ఈ కార్ రేసింగ్‌లో నిధుల విడుదలపై అధికారులతో పూర్తి తెలుసుకున్నానని తెలిపారు. ఏసీబీ విచారణ, కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో వివరాలన్నీ చెబితే కేటీఆర్ దానిని ఆసరాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. ఈ-కార్ రేసింగ్ కుంభకోణానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ప్రజలకు అందిస్తానని వెల్లడించారు.
ట్విట్టర్ పిట్టకు ఇప్పుడు గుర్తొంచిందా?...
ఈ కార్ రేస్‌పై ఏడాదిగా చర్చ జరుగుతున్నప్పటికీ ట్విట్టర్ పిట్ట అయిన కేటీఆర్ నాలుగుసార్లు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఏ రోజు దీనిపై స్పందించలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సమావేశాల్లో చర్చ జరగాల్సిందే అని పట్టుబడుతున్నారని, ఎందుకింత అహంకారమని సీఎం ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఎన్నికల్లో అధికారం పోయింది.. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది.. ఇప్పుడు మెదడు కూడా పోయినట్టుందని ఎద్దేవా చేశారు. కుట్రపూరిత ఆలోచనతోనే చర్చ జరగకూడదని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మేం ఆపకపోతే రూ. 600 కోట్ల కుంభకోణం...
ఈ-కార్ రేసింగ్ అంశంలో రూ.55 కోట్ల నిధులు బదిలీ కాగానే మేం పట్టుకున్నామని, లేకపోతే ఈ వ్యవహారం రూ. 600 కోట్ల కుంభకోణమయ్యేదన్నారు. ఇదంతా ప్రజల సొమ్ము అని, కాంగ్రెస్ ఏర్పడిన కొద్ది కాలానికే తమ దృష్టికి రావడంతో వందల కోట్ల నిధులు దుర్వినియోగం కాకుండా ఆపగలిగామని చెప్పారు. డ్రగ్స్‌తో పట్టుబడిన వారికి వత్తాసుగా ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని కేటీఆర్ దబాయిస్తున్నారని పేర్కొన్నా రు.
ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా, వందల కోట్ల నిధులు బదిలీ చేసినా ఏమీ అనొద్దు అన్నట్టుగా బీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు శాసనసభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీన్ని ప్రభుత్వం ఏ మాత్రం సహించదని హెచ్చరించారు. సభలో మీరు కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చిందని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇంటికి పోతే హరీశ్‌కు కొరడా దెబ్బలే!
పదేళ్లలో పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వందేళ్ల విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం చేస్తున్నారని సీఎం అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తమకు అర్థమైందన్నారు.
ఈ రేసింగ్ విషయంలో శాసనసభలో వారు చొక్కాలు చించుకోకపోతే, ఇంటి వెళ్లాక వారికి మామ చేతిలో కొరడా దెబ్బలు తప్పవని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను కాపాడకపోతే ఇంట్లో పంచాయితీ మొదలవుతుందన్నారు. వారి మామ కేసీఆర్‌కు హరీశ్‌రావు మరీఅంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదని అన్నారు.






