21-08-2025 12:11:30 AM
-సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌లకు సవాల్ విసిరిన హరీష్ రావు
-రంగనాయక సాగర్ సందర్శనలో హరీష్ రావు మండిపాటు
సిద్దిపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గల రంగనాయక సాగరం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సందర్శించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రంగనాయక సాగర్ ప్రాజెక్టు కూడా ఒక భాగమని చెప్పారు. ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రంగనాయక సాగర్ లో గోదావరి జలాలు గలగల పారుతున్నాయి. ఇవన్నీ కాళేశ్వరం జలాలే కాదా? ఇక్కడ నడుస్తున్న పంపులు కాళేశ్వరం లో భాగం కావా? కానీ ఒక్క పిల్లర్ కూలిందని రేవంత్ రెడ్డి గ్లోబల్ ప్రచారం చేస్తూ మొత్తం కాళేశ్వరం కూలిపోయిందన్నట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం అంటే కేవలం ఒకే ఒక నిర్మాణం కాదు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కలిసిన మహా ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ల సాక్షిగా మాట్లాడుదాం రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు ఎవరైనా రండి, కట్టపై కూర్చుని చర్చిద్దామని సవాల్ విసిరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంకా 213 టీఎంసీ నీళ్లు ఖాళీగా ఉన్నాయి.
ఎల్లంపల్లి వద్ద రోజుకు 5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా పోతోంది. మోటర్లు ఆన్ చేస్తే యాసంగీ పంటకు అవసరమయ్యే నీరు రైతులకు చేరుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయాలు చేస్తూ రైతుల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వరదలను ఒడిసి పట్టి నీరు నిల్వ చేయాల్సింది పోయి, బురద రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూసీకి గోదావరి జలాలు తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
కానీ గోదావరి జలాలు వస్తాయంటే అవి కాళేశ్వరం ద్వారానే కదా? కాళేశ్వరం కూలిందని చెబుతున్న ఆయన, మరి హైదరాబాద్ కి నీరు ఎక్కడి నుండి తెస్తారు? నిజానికి కాళేశ్వరం కూలలేదు, రేవంత్ మైండ్ దొబ్బిందని ఎద్దేవా చేశారు. రోజుకు ఒక టీఎంసీ నీరు రిజర్వాయర్లకు తేవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. రాజకీయాలు పక్కన పెట్టి అన్ని మోటార్లు ఆన్ చేసి రైతుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటాం: హరీష్‌రావు
నంగునూరు, ఆగస్టు 20: తెలంగాణలో యూరియా కొరతపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుచూపు లేదని,రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కంటిమీద కునుకు లేకుండా పోయిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు యూరియా కోసం పోలీసుల కాళ్లు మొక్కుతున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రిస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ హయాంలో రైతుల చెంతకే యూరియా అందింది.
కానీ, నేడు చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూసే పరిస్థితి తిరిగి వచ్చింది. రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీ వెళ్లినా యూరియా సమస్యను పరిష్కలరించలేకపోయారు. ఆయనకు ముందుచూపు లేదు, దమ్ము లేదు‘ అని విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డి అందాల పోటీలపై పెట్టిన శ్రద్ధ, యూరియా సమస్యపై పెట్టలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.వెంటనే రైతులకు యూరియా అందించాలి. లేకుంటే, యూరియా కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం‘ అని హరీష్ రావు హెచ్చరించారు. గ్రామాల్లో యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వమని, కాంగ్రెస్ మంత్రులు, నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని స్పష్టం చేశారు.