21-08-2025 01:12:01 AM
మేమే దిక్కు అనే రీతిలో బీజేపీ ధోరణి
-అభివృద్ధిలో భాగమైన ప్రాజెక్టులకు కేంద్రం కొర్రీలు
- పెండింగ్ పేరిట రాష్ట్రాలను అదుపులోకి తెచ్చుకునే యత్నం
- చేయాల్సింది కేంద్రమేనని ప్రజలకు అర్థమయ్యేలా అడుగులు
-ఇప్పటికే పెండింగ్‌లో ట్రిపుల్ ఆర్,మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ
తెలంగాణలోనూ డిట్టో!
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : భౌగోళికంగా, సంస్కృతీ సంప్రదా యాల పరంగా అన్ని రాష్ట్రా లు వేరైనప్పటికీ ప్రజాస్వామ్యయుతమైన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలన్నీ సమానమే. రాజకీయంగా పార్టీలు, ప్రభు త్వాలు వేరుగా ఉన్నా రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి.
కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగేది. రానురానూ రాష్ట్రాల్లో అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారుతున్నది. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో భాగమైన ప్రాజెక్టులకు త్వరతగతిన అనుమతులు మంజూరు చేయడంలో కొర్రీ ల పేరిట జాప్యం చేస్తున్నది. అవసరానికి కాకుండా సందర్భానుసారం ఇచ్చే కార్యాచరణను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తోంది.
రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులకు అనుమతుల ఇవ్వడంలో అడ్డంకులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధు ల విడుదలలో నిర్లక్ష్యం చూపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి చేయడం లోనూ రాజకీయ లబ్ధి కీలక పాత్ర పోషిస్తున్నది. అనుమతులు, నిధుల మంజూరు లోనూ కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అంశమే ప్రధాన భూమి క పోషిస్తున్నాయి. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తలొంచక తప్పని నేపథ్యంలో ఆయా రాష్ట్రా లు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీ కే ఓటు వేసి గెలిపించుకుంటే తమకు ప్రయోజనం అని భావించే పరిస్థితి తెస్తున్నారు. ఇది ఒక లా.. గజేంద్రుని మోక్షంలో మొసలికి చిక్కిన ఏనుగులా, ‘నీవే తప్ప ఇతః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్’ అని విష్ణువుని వేడుకొన్నట్లుగా, ప్రజలు చివరికి బీజేపీ వైపే చూసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
నియంత్రించేందుకేనా?
రాష్ట్రాల్లో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉం టుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంక్షేమ పథకాలకు కేంద్ర వాటా కింద నిధులు మం జూరు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాటాను రాష్ట్రాలకు అందించినప్పటికీ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన మైలే జ్ రావడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలేవైనా పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర భావిస్తున్నది.
దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు పేరు రాకుండా ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరు విషయంలో జాప్యం చేసే ధోరణిని కేంద్రం అవలంభిస్తున్నది. ఈ క్రమంలో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశాన్ని కేంద్ర ప్రభు త్వం వినియోగించుకుంటుంది. దీంతోపాటు పెండింగ్‌లో పెట్టడం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రణలోకి తెచ్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ట్రా లు, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల కేం ద్ర ప్రభుత్వం చూపుతున్న వైఖరే దీనికి నిదర్శనం. ఎన్డీఏ కూటమిలోని రాష్ట్రాలకు ఇబ్బ డిముబ్బడిగా నిధులు, ప్రాజెక్టులు మంజూ రు చేస్తున్న కేంద్రం, వేరే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమలులో, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపులో వెనుకబడుతున్నా యి. తద్వారా ప్రజల దృష్టిలో చేతకాని ప్రభుత్వంగా ముద్ర వేసుకోవాల్సి వస్తున్నది.
రాష్ట్రాల్లోనూ పాగా వేసేలా..
వాస్తవానికి రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించడం, ప్రజా అవసరాలను తీర్చడం రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టతరంగా మారుతుంది. ఈ నేపథ్యం లో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే, రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసే స్థాయికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి.
ఈ పరిస్థితిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పూర్తి స్థాయిలో వాడుకోవాలని వ్యూహ రచన చేస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడటానికి కేంద్రంలోని పార్టీ రాష్ట్రం లో అధికారంలో లేకపోవడమే కారణమని ప్రజలు గ్రహిస్తున్నారు. కేంద్రం నుంచి నిధు లు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయా రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి ఉండదనే ఆలోచ నకు వస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మల్చుకుంటున్నది.
ఇదే అదనుగా భావించి ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి దీనికి అద్ధం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించినా కేంద్రం నుంచి సహకారం మాత్రం శూన్యం. సీఎం సహా మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిని సమస్యలపై విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు లేక రాష్ట్రంలోని అనేక ప్రాజక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
సెమీ కండక్టర్...
రాష్ట్రానికి మూడు సెమీ కండక్టర్ యూని ట్లు ఇవ్వాలని కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ఏపీ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రం రూ. 4,594 కోట్లతో నాలుగు సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన వరల్డ్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డుజేషన్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి మూడు సెమీ కండక్టర్ యూనిట్లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్ రంగానికి తెలంగాణ అన్ని విధాలా అనుకూలంగా ఉన్నందున సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఒక్క యూనిట్ కూడా కేటాయించలేదని, రాష్ట్రంపై వివక్షతోనే కేంద్రం ఈ విధంగా చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
యూరియా కొరత..
ఈ వానాకాలం సీజన్‌లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఏప్రిల్, జూన్, జూలై నెలల్లో 32 శాతం కోత పెట్టింది. మే నెలలో ఏకంగా 45 శాతం కోత పెట్టింది. యూరియా ఎక్కువ అవసరమ య్యే ఆగస్టులో 35 శాతం కోత విధించింది. ఏప్రిల్, జూలై మధ్య 2.10 లక్షల టన్నులు, ఆగస్టు 0.57 లక్షల టన్నులు కోత పెట్టారని, ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. యూరియా కోసం ఏకంగా ఇంటిల్లిపాది షాపుల ముందు రోజంతా పడిగాపులు కాస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు అడ్డంకులు..
రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తు న్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను కేంద్ర ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. హైద రాబాద్ చుట్టూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వే గా 340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ట్రిపుల్ ఆర్‌లో 161.5 కి.మీలతో ఉత్తర, 198 కి.మీలతో దక్షిణ భాగాలున్నాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో ఉత్తర భాగానికి ఐదు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా, కేంద్ర కేబినెట్ ఆమో దం లేకపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్లు ప్రారంభించడం లేదు. ఉత్తర భాగంలో అనుకున్నంత ట్రాఫిక్ ఉండదని కేంద్రం కొర్రీలు పెట్టగా, ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రీ సర్వే చేసి రిపోర్టు అందించారు. దక్షిణ భాగం భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి సుమారు రూ.17 వేల కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిం ది. ఆ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించాలని కోరుతున్నప్పటికీ కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
మూసీ ప్రాజెక్టుకు నిధుల్లేవు..
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఈసా, మూసీ నదుల సంగమ స్థలం బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమి ని ఇవ్వాలని ఇప్పటికీ ఐదుసార్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ స్థలంలో గాంధీ ఐడియాలాజికల్ సెంట ర్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో బాపూఘాట్ అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన కూడా జరగలేదు. అలాగే మూసీ ప్రాజక్టుకు రూ. 20 వేల కోట్ల నిధుల కోసం కేంద్రాన్ని రాష్ట్రం కోరినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపా యి కూడా కేటాయించలేదు.