21-08-2025 01:07:08 AM
-సింగపూర్, టోక్యో లాంటి సిటీలతో హైదరాబాద్ పోటీ
-మూసీ ప్రక్షాళనతో ఓల్డ్‌సిటీ.. గోల్డ్‌సిటీ
-ట్రిపుల్ ఆర్, ఎలివేటెడ్ కారిడాలతో మెట్రో అనుసంధానం
-2034 వరకు ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తిచేస్తాం
-గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
రంగారెడ్డి, ఆగస్టు 20 (విజయక్రాంతి): బెంగుళూరు, చెన్ను లాంటి జాతీయ నగరాలతో కాకుండా అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, టోక్యో లతో పోటీపడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గచ్చిబౌలిలో మూడెకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసి, అందులో 365 రోజులు స్వచ్ఛమైన నీరుపారేలా చర్య లు తీసుకుంటాం. గంగా, యమున, సబర్మతి నదులను వాళ్లు ప్రక్షాళన చేసుకున్నట్టే.. మ నం మూసీనదిని సుందరీకరించుకుందాం. పరిసరాల్లో 24 గంటల పాటు మార్కెట్‌లు కొనసాగేలా అభివృద్ధి చేస్తాం. రాత్రి సమయాల్లోనూ మార్కెట్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటాం. భాగ్యనగరానికి వలస లు పెరగడంతో ఒత్తిడి పెడుతుంది, సిటీని విస్తరించాల్సిన అవసరం ఉంది.
కనెక్టివిటీ కోసం రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లను మెట్రోతో అనుసంధానం చేస్తాం’ అని సీఎం చెప్పారు. ట్రిపుల్ ఆర్‌ను కూడా నగరంతో కనెక్ట్ చేస్తామని వెల్లడించారు. 2034 నాటికి ప్యూచర్‌సిటీని కాలుష్య రహితంగా సిద్ధం చేస్తామని, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి దానిని చూసేందుకు వస్తారని పేర్కొన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మా ణం కొంతమందికి ఇష్టం లేదని ఆరోపించా రు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కూడా కొంతమంది అవహేళన చేశారని గుర్తుచేశారు.
చంద్ర-బాబు, వైఎస్‌తోనే హైటెక్‌సిటీ అభివృద్ధి..
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సీఎంగా, పీజేఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదిరాయి పడిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. రాజీవ్ గాంధీ వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని పునరుద్ఘాటించారు. గడిచిన పదిహేనేండ్లలో రాష్ర్టం ఎంతో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మూడెకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్‌ను గచ్చిబౌలిలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని, వచ్చే ఏడా ది జూన్ 2 నాటికి దీన్ని అందుబాటులోకి తెస్తామని సీఎం పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించినా.. ఓల్డ్‌సిటీని గోల్డ్‌సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన తప్పక జరగాల్సిందేనని ఆయన నొక్కి చెప్పా రు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయా ల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించబోతుందన్నారు. ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నామని, అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు.
రాజీవ్ స్వగృహకు స్థలాలు సేకరించాలి
హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయని, అందుకే పేద, మధ్య తరగతి ప్రజల కోసం రాజీవ్ స్వగృహ సముదాయాలను నిర్మించనున్నామని సీఎం రేవం త్ రెడ్డి వెల్లడించారు. సరసమైన ధరల్లో మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం స్థలాలు వెతకాలని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. గత ప్రభు త్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని ఊరించి ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. సగటు మధ్యతరగతి సొంతింటి కలను సాకా రం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని సీఎం చెప్పారు.