21-08-2025 12:14:36 AM
-ఆలయ భూములపై రియల్ పంజా
-వందల ఎకరాల భూమి మాయం
-ఆక్రమణలవుతున్నా పట్టని అధికార యంత్రాంగం
-ఆలయ భూములంటూ ట్రిబ్యూనల్ తేల్చినా..
-స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు
నల్లగొండ టౌన్, ఆగస్టు 20 : నల్లగొండ జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. కండ్ల ఎదుటే వందల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాగం చేష్టలూడిగి చూస్తోంది. పూర్వకాలంలో ఆలయాలకు సంబంధించి నిత్య పూజలు, దూప, దీప నైవేద్యం కోసం దాతలు భూమిని విరాళంగా ఇచ్చారు.
వేలాది ఎకరాలు ఉన్న ఆ భూములు, ప్రస్తుతం భూకబ్జాదారులు ఆక్రమించుకుని కోట్లు సంపాదించుకుంటున్నారు. కొన్ని దేవాలయాల భూములను కనిపించకుండా చేసి కైవసం చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో రెండు వేలకు పైగా ఉన్న దేవాలయాల్లోని భూములు కాపాడాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నా అధికారుల నుంచి స్పందన కరవైంది. జిల్లాలో రెండు వేలకు పైగా ఆలయాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన భూములను అనేక మంది భూకబ్జాదారులు ఆక్రమించారు.
దేవాలయ భూముల్లో ఏడు వేల ఎకరాలు సాగుకు యోగ్యంగా ఉండగా ప్రస్తుతం కేవలం 2800 ఎకరాల భూములను మాత్రమే లీజుకి ఇచ్చారు. మిగిలిన భూములు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించారు. నల్లగొండ జిల్లాలోని రాములబండ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ధూపదీప నైవేద్యం కోసం హిందూ ధర్మాన్ని కాపాడాలని ఉద్దేశంతో దేవాలయానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్వీకులు కాకుల కొండారంలో ఇచ్చిన 186 ఎకరాల భూమి నేడు పూర్తిగా అన్యకాంతమైంది.
చండూరు మండలం కోట్ల ఆస్తులు ఉన్న ఆలయాలు నిత్య పూజలు నోచుకోకపోవడం పూజారులు ఆలయ భూములనుంచి వచ్చే కవులను అనుభవిస్తూ పూజలు మర్చిపోతున్నారు. ఈ మండలంలో 10 దేవాలయాలకు 153 ఎకరాల భూములు ఉన్నా నేడు ధూప దీప నైవేద్యాలు నోచుకోవడం లేదు.
ఈ భూములు పూజారుల ఆధీనంలో ఉన్న దేవాదయ శాఖ పట్టించుకోవడం లేదు. శిర్దపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయానికి వంద సంవత్సరాల క్రితమే సుమారు ఎకరం 30 గుంటల భూమిని పూర్వీకులు కేటాయించారు. ఈ భూమిని 20 ఏళ్ల క్రితమే పూజారులు గుడ్డు చప్పుడు కాకుండా అమ్ముకున్నారు. ఇప్పటికీ ఈ విషయం నేటికీ దేవాదాయ శాఖకు తెలియని పరిస్థితి.
చండూరు మండలంలో ఇలా..
చండూరు మండలంలోని కస్తాల గ్రామంలోని మరో దేవాలయం భూములు మావే అని పూజారులు కోట్లు అమ్ముకున్నారు. తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయానికి 24 ఎకరాల 12 గుంటల భూమి, హనుమాన్ దేవాలయానికి ఎకరం 30 గుంటలు, తేరేటి పల్లి మార్కండేయ స్వామి దేవాలయానికి 9 ఎకరాల 30 గుంటలు, చెన్నకేశవ స్వామి దేవాలయానికి 34 ఎకరాల 38 గుంటల భూమి, పుల్లెంల బుగ్గ రామేశ్వరాలయం దేవాలయానికి 26 ఎకరాల 13 గుంటల భూములు నేడు అన్యాకాంతం పై దేవాలయాలకు దూపదీప నైవేద్యం లేక గుడులు వెలవెల పోతున్నాయి.
11వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణమైన నల్లగొండ నడిబొడ్డున ఉన్న బ్రహ్మంగారి గుట్ట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి 14 ఎకరాల పైచిలుకు భూమి ఉండగా గత కొన్ని సంవత్సరాలు నుండి కబ్జాదారులకు మైనింగ్ మాఫియా కు అడ్డగా మారిపోయింది. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడమే కాకుండా వాటిని నివాస స్థలాలుగా మార్చుకొని రిజిస్టర్ చేశారు.
రెవెన్యూ, రిజిస్టర్ దేవాదాయశాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డులను మార్చి రిజిస్టర్ చేసుకున్నా, అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో భక్తులు ఫిర్యాదు కూడా చేశారు. భూమిని స్వాధీనం చేసుకొని రికార్డులను అందజేయడంతో, ట్రిబ్యునల్ విచారణ జరిపి అది దేవాలయ భూమిగా నిర్ధారించింది. దీంతో సమస్య సద్దుమణిగిన భూమిని మాత్రం స్వాధీనం చేసుకోలేదు.
ట్రిబ్యూనల్స్‌లో కేసుల విచారణ
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఉన్న వందల ఎకరాలు భూములు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కోర్టు నుంచి తీర్మానం వచ్చినా కూడా దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములపై హైకోర్టు, దేవాలయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్స్ రెవెన్యూ కోర్టులో 1939 కేసులపై విచారణ సాగుతోంది.
దేవాలయ క్రిమినల్‌లో 83 కేసులు ఉండగా, రెవెన్యూ ట్రిబ్యునల్ లో నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేవాదయ శాఖ ట్రిబ్యునల్ తీర్పులో భూములు ఆలయానికి చెందినవేని తేల్చిన కూడా తదుపరి చర్యలు మాత్రం శూన్యమయ్యాయి. ఇప్పటికైనా ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
దేవుడి భూములు అన్యాక్రాంతం..
- జల్లెల గోవర్ధన్ యాదవ్, రాష్ట్రీయ శ్రీరాంసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు
నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూములు అన్నికాంతమవుతున్న రాజకీయ నాయకులకు కాని పాలకవర్గం కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ఉంటూ పట్టించుకోకపోవడం లేదు. జిల్లాలో దేవాలయాలకు 15వేల పైచిలుకు ఎకరాల భూమి ఉండగా నేడు కబ్జాకు గురైనటువంటి భూమి 3000 ఎకరాలే అని దేవాదాయ శాఖ రికార్డులు నమోదై ఉన్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు కబ్జాకు గురైనటువంటి దేవాలయ భూములు 8000 ఎకరాలకు పైచిలుకు ఉన్న అధికారులు నేటికీ కబ్జాకు గురైనటువంటి భూములపై కార్యచరణ చేయకపోవడం కబ్జాకు గురైన భూముల గురించి తెలుసుకోకపోవడం అధికారులకు భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉండడం దేవదాయ శాఖ నిర్లక్ష్య ధోరణి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని దేవాలయ భూములను స్వాధీనపరచుకొని హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలి.