10-07-2025 01:37:32 AM
నాకు బేషజాలు లేవు.. మీ ఫాంహౌస్‌కు రమ్మన్నా వస్తా
* హైదరాబాద్‌లో 20% ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన తరువాతే మిగిలిన జలాలను విభజించాలని డిమాండ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే.. కృష్ణా నీటిని జూరాల నుంచే పాలమూరు రంగారెడ్డికి తరలించుకుంటే ఏపీకి నీరు తరలించుకపోయే అవకాశం ఉండేది కాదు. కేసీఆర్ కారణంగానే కృష్ణాజలాలను ఏపీ దోపిడీ చేస్తోంది. పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో రావాల్సిన హక్కులు రాకపోగా, ప్రయోజనం కూడా లేకుండా పోయింది.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 9(విజయక్రాంతి) : తెలంగాణ నీటి హక్కు లు, జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతాంగ సమస్యల వంటి అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు ఆరోగ్యం సహకరించకపోతే వారి ఆహ్వానం మేరకు తాము ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వచ్చేందుకైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి చర్చించేందుకు తమ మంత్రుల బృందాన్ని పంపిస్తానని, కాదు కూడదంటే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి తనకేమీ బేషజాలు లేవని అన్నా రు.
వరద జలాలు ఏపీ తీసుకెళ్తే తెలంగాణకు ఎందుకు అభ్యంతరమని చంద్రబాబు అంటున్నారని, మిగులు జలాలు నల్లగొండ, రంగారెడ్డికి తీసుకెళ్తే తమకేంటి అభ్యంతరమని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేస్తే, నిధులు పోయాయని నీళ్లు మాత్రం తెలంగాణకు రాలేదని, తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతోనే ఏపీకి వరద జలాలు కనబడుతున్నాయని స్పష్టం చేశా రు.
బుధవారం కృష్ణా జలాలు ఏపీ కి అక్రమంగా తరలింపు, కాళేశ్వరం ప్రాజెక్టు మార్పు అంశంపై నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీళ్లు, నిధులకు సంబంధించి కేసీఆర్ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామన్నారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, అటు తరువాత అభ్యర్థులు కూడా దొరకక ఫ్రస్ట్రేషన్‌లో కొందరు విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఏడాదిలోనే సర్వం నాశనమైంది అన్నట్టు, మళ్లీ వాళ్లు వస్తేనే బాగుపడుతుందన్నట్టు వితండ వాదన చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేసుకుందామని కోరినట్టు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటే పిల్లలు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు శాశ్వతంగా మరణశాసనం రాశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో 20 శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన తరువాతే మిగిలిన జలాలను విభజించాలని డిమాండ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేదని స్పష్టం చేశారు. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే.. కృష్ణా నీటిని జూరాల నుంచే పాలమూరు రంగారెడ్డికి నీటిని తరలించుకుంటే ఏపీకి నీరు తరలించుకపోయే అవకాశం ఉండేది కాదని తెలిపారు.
నీళ్లను తీసుకెళ్లడం ద్వారా పవర్ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం అవడంతో విద్యుత్ పరంగానూ తెలంగాణకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు 2 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉండగా దానిని 1 టీఎంసీకి తగ్గించారని విమర్శించారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి, తరలించాల్సిన నీటిని తగ్గించారని తెలిపారు. పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో రావాల్సిన హక్కులు రాకపోగా, ప్రయోజనం కూడా లేకుండా పోయిందన్నారు.
దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడతాం..
కేసీఆర్ కుటుంబంలో సమస్య ఉండే పెద్దల సమక్షంలో కూర్చొని పంచాయితీని తేల్చుకోవాలని, ఈ రకమైన వీధి బాగోతాలు మంచిది కాదని హితవు పలికారు. తను క్లబ్బులకు, పబ్బులకు దూరమని, వాస్తవాలను ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తే హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారని.. ఇది గడీ కాదని, ప్రజా భవన్‌కు ఎవరైనా రావచ్చని తెలిపారు.
తాము తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టబోమని ఉద్ఘాంటించారు. తెలంగాణ హక్కుల విషయాలలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని స్పష్టం చేశారు. చచ్చిపోయిన పార్టీని బలికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్ చేయలేదని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉంటే మనం వదిలితేనే ఏపీకి నీళ్లు వెళ్లేవని తెలిపారు. కేసీఆర్ కారణంగానే కృష్ణాజలాల్లో ఏపీ నీటి దోపిడీ చేస్తోందన్నారు. గతంలో మంచి సూచనలు చేసిన చిన్నారెడ్డిని అవహేళన చేశారని గుర్తు చేశారు.
ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడంతోనే మన హక్కులు కోల్పోయామని స్పష్టంచేశారు. తప్పులు వారు చేసి తమపై నెపం మోపుతున్నారని, వారు చేసిన తప్పులను సరిదిద్దుతుంటే పైనుంచి ఆరోపనలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి కంటే వెయ్యి రెట్ల ద్రోహం..
కృష్ణాలో ఉమ్మడి రాష్ర్టంలో పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు అధికంగా కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ విషయంలో ఉమ్మడి రాష్ర్ట పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టా ల్సి వస్తే కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలన్నారు. రావాల్సిన నీటి కోసం తాము పోరాటం చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బేసిన్లు భేషజాలు లేవంటూ తెలంగాణకు కేసీఆర్ నీళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. ఏపీ పక్షాన వకాల్తా పుచ్చుకోవడానికి వారికి పాలేరుగా మారారా అని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌కు అనుకుని ఉన్న గోదావరి జలాలను రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీరు తరలించకుండా ఎందుకు ఆయకట్టు తొలగించారని ప్రశ్నించారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
ఆంధ్రప్ర దేశ్ మెప్పు కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని తెలిపారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎకరాకు రూ. 93 వేల ఖర్చుతో మొత్తం 54 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే, కేసీఆర్ హయాంలో ఎకరాకు రూ. 11.40 లక్షల ఖర్చుతో కేవలం 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని వెల్లడించారు.
ఉమ్మడి రాష్ర్టంలోని పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందంటే కేసీఆర్ అనుభవా న్ని, సూచనలను పరిగణనలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఎక్స్‌పర్ట్‌ల ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దామని, మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పడు స్పీకర్‌కు లేఖ రాసినా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.