10-07-2025 01:26:06 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను 50 ఏండ్ల పాటు కాంగ్రెస్‌పార్టీ కాలరాసిందన్నారు.
కృష్ణా నీళ్లను పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు తరలిస్తుంటే హారతులు పట్టింది ఆనాటి కాంగ్రెస్ మంత్రులని, బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఫైరయ్యారు.
రాష్ర్ట ప్రభుత్వం అధికార భవన్‌లో అధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ఇరిగేషన్‌పై చర్చకు రమ్మంటూ అంటూ రంకెలు వేసే రేవంత్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్‌కు భంగం కల్పించడమేనని, దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్‌కి, శాసన మండలి చైర్మన్‌కి ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పనికి రాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని ఎన్డీఎస్‌ఏ చెప్పినా, ఎల్‌అండ్‌టీ రిపేర్ చేయడానికి సిద్ధపడినా ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎన్డీఎస్‌ఏవి ప్రేరేపిత రిపోర్టులు:
బీజేపీ, ఎన్డీఏ పాలిత బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో వంతెనలు కూలడం సర్వసాధారణంగా మారిందని, వీటిపై విచారణలు, చర్యలు ఉండవని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రెండు రోజుల్లో ఎన్డీఎస్‌ఏ వచ్చి హడావిడిగా విచారణ పేరుతో పొలిటికల్ డైవర్షన్ చేస్తూ రాజకీయ ప్రేరేపిత రిపోర్టులను ఇస్తారని ఎక్స్ వేదికగా బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కేంద్రం, ఎన్డీఎస్‌ఏ నిర్మిస్తున్న పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, గైడ్ బండ్ కొట్టుకుపోయినా విచారణ, నివేదిక ఉండదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కుప్ప కూలిన ఎస్‌ఎల్బీసీ, సుంకిశాల, కొట్టుకుపోయిన వాటర్ పంప్ హౌస్, పెద్దవాగుపైన బీజేపీ కనీసం స్పందించదని, ఎన్డీఎస్‌ఏ రాదని ఆరోపించారు. ఇది బీజేపీ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.
మేడిగడ్డకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుజరాత్ వడోదరలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలి పదిమంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం, సానుభూతి తెలిపారు.
సీఎంను మైనార్టీలు ఎలా నమ్మాలి?
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేర్లతో ముస్లింల ఇళ్లను రేవంత్ ప్రభుత్వం కూల్చిందని, ఆ ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని, అలాంటి సీఎంను మైనార్టీలు ఎలా నమ్ముతారని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని, కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. సమావేశంలో మాజీమంత్రులు శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు పాల్గొన్నారు.
నేడు ఘోష్ కమిషన్ ముందుకు..
కాళేశ్వరం బరాజ్‌లపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం ఉదయం 11 గంటలకు మరోసారి హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచా రణ కమిషన్ ముందుకు ఆయన వస్తారు. గత నెల 9వ తేదీన కాళేశ్వరం కమిషన్ హరీశ్‌రావును విచారించింది. బరాజ్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో మరోసారి కమిషన్ ముందుకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి గురువారం కమిషన్ ముందుకు రానున్నారు.