19 May, 2026 | 8:23 AM

రియల్ కంపెనీ మోసం

20-06-2024 12:22 AM
  • ప్రీలాంచ్ పేరుతో జీఎస్‌ఆర్ గ్రూప్స్ ఇన్‌ఫ్రా రూ.200 కోట్ల దోపిడీ

సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన.. కేసు నమోదు

సుమారు 200 మందికి కుచ్చుటోపి 

పరారీలో జీఎస్‌ఆర్ గ్రూప్స్ యాజమాన్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): నగరంలో మరో ప్రీలాంచ్ మోసం వెలుగుచూసింది. జీఎస్‌ఆర్ గ్రూప్స్ ఇన్‌ఫ్రా ‘ఈవీకే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సుమారు 150 నుంచి 200 మంది బాధితులను మోసం చేసి రూ.200 కోట్లతో పరారయ్యారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల కష్టార్జితాన్ని దోచేశాయి. తక్కువ ధరలో ఫ్లాట్లు వస్తుందంటే చాలు కొందరు వెనకాముందు ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా వస్తుందని చూస్తున్నారు కానీ, బిల్డర్ సకాలంలో పూర్తి చేస్తాడా లేదా అనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ మహానగరంలో ఇన్ని మోసాలు జరిగిన రోజుకో మోసపూరిత స్కామ్ ఆరంభంతో ప్రజలు మోసపోతూనే ఉండడం గమనార్హం.

జీఎస్‌ఆర్ గ్రూప్స్ పేరుతో..

మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు ఇస్తామంటూ జీఎస్‌ఆర్ గ్రూప్స్ ఇన్‌ఫ్రా ‘ఈవీకే ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో రంగురంగుల బౌచర్లను ప్రింట్ చేయించి కొనుగోలుదారులను నిండా ముంచేశారు. కొల్లూరు, యాదాద్రి, నారాయణఖేడ్, రామోజీ ఫిలిం సిటీ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టామంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు ఫోన్లు చేయిస్తూ తమ సంస్థలో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలని మాయమాటలు చెప్పి వందలాది మందితో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించారు. ఓ ఖాళీ స్థలాన్ని చూపించి ఇక్కడే జీఎస్‌ఆర్ గ్రూప్ విల్లాలు, అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తున్నామని ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షలు మొదలుకొని రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు.

కస్టమర్లలో నమ్మకం కలిగించడానికి చెక్కులు, బాండ్ పేపర్లు (ఎంఓయూ) ఇస్తూ వచ్చారు. తర్వాత ఏమైందో ఏమో గానీ, తాము కన్‌స్ట్రక్షన్ చేయట్లేదని, వేరే సంస్థకు పనులు అప్పగిస్తున్నామని వారు నిర్మాణాలను పూర్తి చేస్తారని కస్టమర్లను నమ్మిస్తూ వచ్చారు. అలా కొద్దికాలం గడిచిన తర్వాత ఎలాంటి అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు నిర్మాణాలు జరగకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జీఎస్‌ఆర్ గ్రూప్ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాస్‌రావును నిలదీయగా బాధితులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో కొద్దిమంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కొద్దికాలం నుంచి కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ బాధితులు వాపోయారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడని బాధితులు తెలిపారు.

రెట్టింపు డబ్బును చెల్లిస్తామంటూ..

జీఎస్‌ఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బు చెల్లిస్తామంటూ మరికొంతమందిని మోసం చేశారు. రెండేళ్లలో పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఇస్తామని చెప్పడంతో చాలా మంది అధిక డబ్బులు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టి నిండా మునిగారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగడానికి వారికి చెక్కులు కూడా ఇచ్చాడు. సమయం ముగిసిన డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జీఎస్‌ఆర్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తన కార్యాలయానికి వచ్చిన పలువురు బాధితులను భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిపారు. అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి పలువురు రౌడీలను పురామయించి తాము చెప్పినట్లు వినాలని, లేకపోతే డబ్బులు ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. 

పోలీసులను ఆశ్రయించిన బాధితులు..

జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్‌లో మోసపోయిన బాధితులు మార్చి 9న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రీలాంచ్ బాధితులు ఎక్కువగా ఉండటం, కోట్లలో డబ్బు పెట్టుబడులు పెట్టడంతో పోలీసులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మే నెల నుంచి సీసీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన ఇన్‌ఫ్రా విచారణ బాధితులు న్యాయం కోసం మీడియాను సంప్రదించడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా బాధితులంతా ఏకమై వచ్చి సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా చైర్మన్ శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారించిన డీసీపీ శ్వేతారెడ్డి బాధితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

న్యాయం చేయండి: వెంకటేశ్, దంత వైద్యుడు, గచ్చిబౌలి 

జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా గ్రూప్ మోకిలలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌కోసం రూ.50 లక్షలు చెల్లించా. రెండేళ్లలో విల్లా పూర్తి చేసి ఇస్తామని ఎంవోయూ ఇచ్చారు. కానీ, అసలు నిర్మాణం జరగట్లేదని తెలుసుకుని, వారిని సంప్రదిస్తే అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇలా కొన్ని రోజుల తర్వాత సంస్థ కార్యాలయాన్ని కూడా మూసివేశారు. పస్తుతం వారు కనబడకుండా పోయారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిందితుడిని త్వరగా పట్టుకొని న్యాయం చేయండి.