ఆత్మను తెలుసుకోవడమే ఆధ్యాత్మికం
కోదాడ, జూలై 26 :ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం అని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని నయానగర్లో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతం ఆధారముగా వివరణ వ్రాసిన భగవద్గీతతో పాటు అనుబంధ 101 గ్రంథాలను ఇంటింటికి తిరిగి పరిచయం చేశారు. త్రైతం అంటే మూడు అని, పరమాత్మ, ఆత్మ, జీవాత్మల వివరము తెలుపునదే త్రైత సిద్ధాంతం అన్నారు.
భగవద్గీతలో మూడు ఆత్మల వివరమును ఇప్పటి వరకు వివరణ వ్రాసిన స్వామీజీలు చెప్పలేదని, ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంత భగవద్గీతలో మూడు ఆత్మల వివరము తెలిజేయడంతో పాటు ఏ శ్లోకము ఏ ఆత్మకు వర్తిస్తుందో వివరించారని, ప్రతి శ్లోకం దేని గురించి చెబుతుందో ప్రత్యేకంగా బ్రాకెట్ ఏర్పాటుచేసి వివరించడం త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రత్యేకత అన్నారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతము ఆధారముగా 101 గ్రంథాలు రచించి ఆధ్యాత్మికంలో ప్రశ్న మిగులకుండా చేశారన్నారు.
ఎక్కడ ప్రశ్నకు సమాధానం ఉండదో అక్కడ అనుమానం పెద్దదై అప్పటి వరకు నేర్చుకున్నదంతా కూలిపోతుందన్నారు. శాస్త్రబద్దమైన త్రైత సిద్ధాంత గ్రంథాలను చదివితే దేవుడిని చేరుకునే దారి తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు ముత్తవరపు శైలజ, రాళ్లబండి శైలజ, వంగాల మహేష్, సైదా, నర్సింహారావు పాల్గొన్నారు.






