14 June, 2026 | 1:42 AM

మోటారు లేని బోరు ధార

14-06-2026 12:00 AM

తాగు నీటికో.. సాగు నీటికో ఎన్నో అడుగులు బోరు తవ్విస్తేనే నీరు పడుతుంది. అవి బయటకు తీసి వాడకం చేయాలంటే అంత లోతు నుంచి విద్యుత్తు మోటారు సహాయంతోనే సాధ్యం. కానీ ఈ బోరు అలా కాదు. ఇది 365 రోజులు ఏ విద్యుత్తు మోటారు లేకుండానే నిత్య ధారగా పోస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మండుతున్న ఎండల్లో సైతం నిత్య నీటి ధార పోస్తూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్‌తండా సమీపంలోని అటవీ ప్రాం తంలోని బోరు ఇది. మూడున్నర దశాబ్దాల క్రితం బొగ్గు అన్వేషణ కోసం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అక్కడక్కడ బోర్లు తవ్వుకుంటూ వెళ్లారు. బొగ్గు నిక్షేపాలు ఉంటే శాంపిల్స్ తీసుకుని వెళ్లా రు.

అలా తవ్వి వదిలేసిన బోరు నిత్యం నీరు పోయడం మొదలైంది. మద్రాస్‌తండాకు చెందిన హరిచంద్ అనే రైతు దానికి ఒక దిమ్మె కట్టించి వంక పైపు తగిలించి తనకున్న ఎకరం పొలానికి వాడుకోవడం మొదలెట్టాడు. ఎలాంటి సౌకర్యం లేని ఆయనకు ఆ బోరు ఆసరాగా మిగిలింది. ఆయనకు మూడున్నర ఎకరం పొలం సాగుకు దశాబ్దాల కాలం నుంచి ఉపయోగపడుతోంది. ఏటా మొదట వరిసాగు, ఆ తర్వాత కూరగాయల సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. వేసవిలో ఆ మార్గంలో వెళ్లే వారికి ఈ బోరు దాహం కూడా తీరుస్తోంది. ఇలా బొగ్గు అన్వేషణ కోసం వేసిన బోరు ఉపయోగ పడటం దాని ప్రత్యేకతే.  అన్నారపు వెంకటేశ్వర్లు (ఇల్లెందు/టేకులపల్లి, విజయక్రాంతి)