పొయ్యి వెలిగిన ఇంట్లోనే పేర్లు నమోదు చేయండి
- జన గణనలో గోప్యత పాటిస్తాం
- వచ్చే నెల 10 వరకు స్వీయ జనగణనలో పాల్గొనండి
- ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం
- ప్రజా సమస్యలే ఎజెండాగా కథనాలివ్వండి
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 27 ( విజయక్రాంతి ) : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సేవ చేయడానికే ఏర్పడిందని, ప్రతి అధికారి ప్రజల పట్ల జవాబుదారీగా పనిచేయాలని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో దేవసహాయం తదితరులతో కలిసి ఆయన ప్రజల వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 33 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. స్వీయ జనగణనపై నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జనగణనలో ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వలస కార్మికులు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, ఇతర సామాన్య కూలీలు ఎవరైనా పొయ్యి వెలిగిన చోటు నివసించే ఇంటి నుంచే తమ పేర్లు జనగణలలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని 20 మండలాలు, 460 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలలోని 86 వార్డుల్లో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు కంప్యూటర్, మొబైల్ ద్వారా Census Self Enumeration Portal లో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జనగణనలో ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు 2,500 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పనిచేస్తున్నారని తెలిపారు.
ఇక రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు బాలల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.






