26 August, 2026 | 2:44 AM

సెప్టెంబర్ 10లోగా వరిసాగు వివరాల నమోదు తప్పనిసరి

26-08-2026 01:46 AM

రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారుల సూచన

కల్లూరు, ఆగస్టు 25(విజయ క్రాంతి): ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం రైతులు సాగు చేస్తున్న వరి పంట వివరాలను సెప్టెంబర్ 10, 2026లోగా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.మండలంలోని రైతులు తమ వరి సాగు వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), వ్యవసాయ సిబ్బంది ద్వారా పోర్టల్లో నమోదు చేయించుకోవాలని తెలిపారు.

డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆధార్ కార్డు,పట్టాదారు పాస్బుక్,పంట వివరాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.అదే విధంగా సొంత విత్తనాలు లేదా ఇతర రైతుల నుంచి విత్తనాలు తీసుకుని వరి సాగు చేస్తున్న రైతులు కూడా తమ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

వరి సాగు వివరాలు నమోదు చేయని పక్షంలో భవిష్యత్లో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం,పంట కొనుగోలు తదితర అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా తమ పంట వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు.రైతులు సెప్టెంబర్ 10లోగా వరి సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకుని,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట సాగు వివరాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖకు సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.