6 August, 2026 | 2:42 AM

సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేయించాలి

06-08-2026 01:53 AM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ ఈటల వినతి

మేడ్చల్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): నిజామాబాద్ వైపు వెళ్లే 44వ నెంబరు జాతీయ రహదారి, ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే జాతీయ రహదారి ఫ్లై ఓవర్ల సర్వీస్ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి విన్నవించారు. తెలంగాణ బిజెపి ఎంపీల బృందం కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ కొంపల్లి, ఉప్పల్ రోడ్లమీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. సర్వీస్ రోడ్లు గుంతల మయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సర్వీస్ రోడ్లపై గుంతలు పూడ్చివేయాలని కోరారు. పది రోజుల్లో సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఆదేశించారని ఈటెల రాజేంద్ర తెలిపారు. కేంద్ర మంత్రులు కలిసిన వారిలో పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఎం రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి నగేష్ ఉన్నారు.