6 August, 2026 | 3:26 AM

నో మినరల్స్?!

06-08-2026 01:53 AM

*మినరల్ వాటర్ పేరుతో.. జనరల్ వాటర్ అమ్మకాలు!

*నిబంధనలు గాలికి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

మహబూబాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): వేసవి, వర్షాకాలం అనే తేడా లేకుండా మినరల్ వాటర్కు డిమాండ్ పెరుగుతోంది. ప్రజల దాహాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు ‘మినరల్ వాటర్’ పేరుతో సాధారణంగా శుద్ధి చేసిన నీటిని క్యాన్లలో నింపి 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మినరల్ వాటర్ పేరుతో జరుగుతున్న నీటిపై నాణ్యత, శుద్ధి ప్రక్రియ, ప్రయోగశాల పరీక్షలపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు ‘మినరల్ వాటర్’ అంటే ఏదో ప్రత్యేకమైన సహజ నీరు అని భావిస్తుంటారు.

భూగర్భ జలాలే.. క్యాన్ లోకి?

కొన్ని ప్రాంతాల్లో బోర్లు, బావుల నుంచి నీటిని సేకరించి తగిన శుద్ధి ప్రక్రియలు సరిగా చేయకుండానే క్యాన్లలో నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 20 లీటర్ల వాటర్ క్యాన్ల విషయంలో పరిశుభ్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారి వినియోగించిన క్యాన్లను సరైన విధానంలో శుభ్రపరచకుండా పదేపదే వినియోగించడం వల్ల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల కలుషితానికి అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్ పై తయారీదారు పేరు, చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, వినియోగించాల్సిన గడువు, పరిమాణం తదితర వివరాలు ఉండటం మాత్రమే కాదు.. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్యాకేజింగ్ జరుగుతున్నదా అనే అంశం కూడా కీలకం. కొన్ని చోట్ల నాణ్యతా ధ్రువీకరణ లేకుండానే విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసలు నీటి నాణ్యత ఏమిటో వినియోగదారులకు తెలియని పరిస్థితి నెలకొంది. 

ఆరోగ్యంపై ప్రభావం

కలుషితమైన నీటిని తాగడం వల్ల విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, కాలేయ సంబంధమైన వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు ప్రమాదం ఉంటుంది. నీటిలో సూక్ష్మజీవులు, రసాయన కాలుష్యాలు లేదా ఇతర మలినాలు ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

అధికారులు తనిఖీలు చేయాలి

జిల్లా, మున్సిపాలిటీ, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కొనసాగుతున్న మినరల్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లపై సంబంధిత శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీటి నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షలు చేయించాలి. అనుమతులు, నాణ్యతా ప్రమాణాలు, శుద్ధి ప్రక్రియ, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించాలి.

‘మినరల్’ ముసుగులో మాయాజాలానికి అడ్డుకట్టేదెప్పుడు?

ప్రజల ప్రాణాలతో ముడిపడిన తాగునీటి వ్యాపారంలో నిబంధనల ఉల్లంఘనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ‘మినరల్ వాటర్’ పేరుతో సాధారణ నీటిని విక్రయిస్తున్న యూనిట్లను గుర్తించి, నీటి నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వాటర్ ప్లాంట్ల యజమానులకు నోటీసులు

కేసముద్రం పట్టణ పరిధిలోని వాటర్ ప్లాంట్ల యజమానులకు మున్సిపల్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. గ్రామ పరిధిలో ఇంతకాలం నిర్వహించిన వాటర్ ప్లాంట్ యజమానులు పట్టణ పరిధిలోకి చేరడం వల్ల మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లను నిర్వహించాల్సి ఉంటుంది.

నీటి నాణ్యత ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, భూగర్భ జల వనరుల శాఖ అనుమతి, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు, మిషనరీ నాణ్యత దృవీకరణ, తదితర అంశాలతో మున్సిపల్ పరిధిలో కొత్తగా అనుమతి తీసుకోవాలంటూ ఎనిమిది వాటర్ ప్లాంట్లకు నోటీసులు జారీ చేసాం. పూర్తిగా నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించిన తర్వాత కొత్తగా అనుమతులు జారీ చేస్తాం. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తే సీజ్ చేసి చర్యలు తీసుకుంటాం. 

టీ.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం