08-07-2025 12:00:00 AM
ప్రభుత్వానికి అందించనున్న ఘోష్ కమిషన్
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్టు సమాచారం. సంబంధిత నివేదికను ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, డిజైన్ సమస్యలు, టెండరింగ్ ప్రక్రియలో అక్రమాలు, నిధుల సమీకరణలో అవకతవకలపై కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది.
ఇందులో భాగంగా ఇప్పటివరకు 115 మందిని విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. కమిషన్ విచారించిన వారిలో ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ కంపెనీలతోపాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు తదితరులు న్నారు.
అయితే కాళేశ్వరం నిర్మాణ సమ యంలోని క్యాబినెట్ మినిట్స్‌ను కూడా ఇటీవల ప్రభుత్వం కమిషన్‌కు అందించినట్టు సమాచారం. వాటిని కూడా నివేదికలో కలిపి జూలై చివరి వారంలో ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనున్నట్టు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోనున్నది.
ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కమిషన్ నోటీసులు..
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టి, విచారణ కమిషన్‌ను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలతో నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనిల్ కుమార్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ ముందు అబద్ధపు స్టేట్‌మెంట్ ఇచ్చారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
వాస్తవానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం పరిస్థితులను తెలుసుకునేందుకు ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో కమిటీ వేసింది. వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయిలో సమగ్రంగా నివేదిక సమర్పించాలని సూచించింది. అయితే మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను అనిల్‌కుమార్ నివేదిక ప్రస్తావించలేదు.
ముఖ్యంగా బారజ్ పియర్లు కుంగిపోవడానికి ముందు, ఆ తర్వాత చేపట్టిన గ్రౌటింగ్ పనుల గురించి ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాచారాన్ని దాచిపెట్టారని కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అనిల్‌కుమార్‌పై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోసారి కమిషన్ ముందు హాజరై ఎందుకు కీలక అంశాలను నివేదికలో పొందుపర్చలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 10:30 గంటలకు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని అనిల్ కుమార్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.