07-07-2025 11:14:17 PM
గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డ ముగ్గురు నిందితులు..
చేవెళ్ల: డ్రిల్లింగ్ మిషన్ తో వైన్స్ గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డ ముగ్గురు నిందితులు కౌంటర్ లో ఉంచిన రూ. 4.38 లక్షలు చోరీ చేశారు. ఎస్సై సంతోష్ రెడ్డి(SI Santosh Reddy) వివరాల ప్రకారం.. మొయినాబాద్ కు చెందిన నంద్యాల రాజేందర్ రెడ్డి ఏడాదిన్నరగా చేవెళ్ల–షాబాద్ రోడ్డులో కందాడ గేటు వద్ద ఉన్న వైన్ షాపులో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ లిక్కర్ అమ్మకం ద్వారా వచ్చే రూ. 3.5 లక్షల నుంచి రూ.4 లక్షలను యజమాని శ్రీకాంత్ రెడ్డికి అప్పజెప్తాడు. అయితే ఆదివారం శ్రీకాంత్ రెడ్డి శ్రీశైలం వెళ్లడంతో... ఆ రోజు కలెక్షన్ రూ.3.08 లక్షలు, కూల్ పాయింట్స్ శ్రీశైలం ఇచ్చిన రెంట్ రూ. 1.30 లక్షలు మొత్తం రూ. 4.38 లక్షలు కౌంటర్ లో పెట్టి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికెళ్లాడు.
సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చి షాప్ తెరవగా.. కౌంటర్ లో పెట్టిన క్యాష్ కనిపించలేదు. వెనకవైపు గోడకు రంధ్రం చేసి ఉంది. సీసీ కెమెరాలు చెక్ చేయగా రాత్రి 2.20 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్క్ వేసుకొని.. డ్రిల్లింగ్ మిషన్ ద్వారా గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడినట్టు రికార్డు అయ్యింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.