calender_icon.png 18 August, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్ర కుంట చెరువును కాపాడాలని కలెక్టర్ కు వినతి

18-08-2025 08:07:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల ఎర్రకుంట చెరువును కబ్జాల నుండి కాపాడాలని సోమవారం మంచిర్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కన్నాల మాజీ సర్పంచ్ మంద అనిత జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 45 లో ఎర్రకుంట చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఆమె వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. 3.28 విస్తీర్ణంలో  ఎర్ర చెరువు ఉందని, బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ కలుపుకొని మరో 10 ఎకరాలు ఉందని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం చెరువు విస్తీర్ణం ఒక ఎకరం కూడా లేదని తెలిపారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుకు గండి కొడుతూ నీరు నిలవకుండా చేసి ఫ్లాట్లు ఏర్పాటు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 60 రైతు కుటుంబాలు ఆ చెరువుపై ఆధారపడి వ్యవసాయం కొనసాగించేవని, చెరువు పూర్తిగా కనుమరుగవ్వడంతో ప్రస్తుతం బీడు భూముల్లో వ్యవసాయం సాగించలేని పరిస్థితి ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

65 మత్స్యకారుల కుటుంబాలు కూడా ఈ చెరువు పైనే జీవనోపాధి పొందేవని, నీరు నిలువలేక వారి జీవనోపాధికి ఆటంకం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఎర్ర  కుంట చెరువు కబ్జా జరుగుతున్న విషయం అనేకసార్లు ఇరిగేషన్ అధికారులకు విన్నవించిన వారు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు చెరువు పునరుద్ధీకరణ చేసి రైతులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కలెక్టర్ ను వేడుకున్నారు.