బస్ సర్వీసులు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి
హుజురాబాద్,మార్చి31:( విజయక్రాంతి): హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులకు ఆమోదం తెలపాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రిని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. దాంతో పాటు హుజూరాబాద్ డిపో పరిధిలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని కోరారు.
ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రణవ్ తెలిపారు. బేతిగల్ నుంచి కరీంనగర్, మర్రిపల్లిగూడెం నుండి హైదరాబాద్, జమ్మికుంట నుండి హైదరాబాద్ కు ఇప్పటికే సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా, మరికొన్ని ప్రాంతాలకు కూడా నూతన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, గూడూరి స్వామి రెడ్డి, నేరెళ్ళ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




