22 May, 2026 | 1:11 PM

రియల్ సంస్థలకు రెరా షోకాజ్ నోటీసులు

19-06-2024 12:10 AM

రిజిస్ట్రేషన్ లేకుండానే స్కై విల్లాస్ నిర్మాణాలు 

అనుమతులు లేకుండానే  ప్రచారం

ప్రకటనలతో మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్దంగా అనుమతులు లేకుండా స్కై విల్లాస్ నిర్మాణా లు చేపడుతూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు రెరా అథారిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు  రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి సమీపంలో సొనెస్టా ఇన్ఫినిటీ కంపెనీ స్కై విల్లాస్ పేరుతో, శ్రీశైలం హైవే సమీపంలోని కడ్తాల్ టౌన్ ఫార్మా సిటీ వద్ద హస్తీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్.. బ్రిస్సా ప్రాజెక్టు పేరుతో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే నిర్మాణం చేపడుతున్నాయి.

ప్రజలను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో బ్రోచర్ విడుదల చేసి ప్రచారం చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నట్టుగా రెరా అథారిటీ గుర్తించింది. దీంతో, రెరా అధికారులు సోనెస్టా ఇన్ఫినిటీ, హస్తీనా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్‌కు మంగళవారం షోకా జ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లం ఘించే సంస్థలపై సెక్షన్ 59 ప్రకారం అపరా ధ రుసుముతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం రెరా అథారిటీకి ఉందని గుర్తు చేశారు. ఇండ్లు, ఫ్లాట్లను రెరా రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టుల్లో మాత్రమే కొను గో లు చేయాలని ప్రజలకు సూచించారు.  రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్స్, భవన నిర్మాణదారులపై 90000 06301, 040 29394972 నంబర్లలో, reramaud@ telan gana. gov.in, secyre ramaud @tela ngana. gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.