01-09-2025 02:31:05 AM
ఆరునూరైనా అమలు చేసి తీరుతాం
-సీలింగ్ 50% దాటొద్దని చట్టం చేసిందే బీఆర్‌ఎస్
-పరిమితి పెంచేందుకు ఆర్డినెన్స్ చేశాం..
-మరోసారి బిల్లు పెట్టాం.. దయచేసి అడ్డుపడొద్దు !
-అసెంబ్లీలో సీఎం రేవంత్ సమాధానం
-కోటా ఆపేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్: మంత్రి శ్రీధర్‌బాబు
-సీఎం ఆమరణ దీక్ష చేయాలి: బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్
-మున్సిపల్, పీఆర్, ప్రైవేట్ మెడికల్ కేర్, కొత్త మున్సిపాలిటీల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆరు నూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఆదివారం అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం స్పందిస్తూ.. రిజర్వేషన్లు సీలిం గ్ 50 శాతం దాటొద్దని చట్టం చేసిందే బీఆర్‌ఎస్ పెద్దలని మండిపడ్డారు. తాము బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
సీలింగ్ పరిమితి తొలగింపునకు ఆర్డినెన్స్‌ను తెచ్చి గవర్న ర్‌కు పంపించామని వెల్లడించారు. కోటాపై అనుమానాలు కలిగేలా బీఆర్‌ఎస్ సభ్యుల వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మొదట బీసీల వివరాలు సేకరించే బాధ్యతను బీసీ కమిషన్‌కే అప్పగించిందని, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమాచార సేకరణ జరగాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని, పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం డెడికే టెడ్ కమిషన్‌ను నియమించాలని ఆదేశించిందని వెల్లడించారు.
న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే తాము డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. బీసీ కోటాకు అడ్డంకులు రాకూడదనే తమ ప్రభుత్వం అధికారుల కమిటీ, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయించిందని తెలిపారు. విద్య, ఉపాధి రంగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము చిత్తశుద్ధితో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని, ఆ బిల్లులను గవర్నర్ వద్దకు పంపించామని గుర్తుచేశారు. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి వద్దకు పంపించారని వివరించారు. ఆ రెండు బిల్లులు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టుకు వెళ్లారని, న్యాయస్థానం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా ఇవ్వాలంటే, 2018లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గుదిబండగా మారిందన్నారు. దీంతో తమ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపించామని గుర్తుచేశారు. గవర్నర్ మళ్లీ కొందరి (బీఆర్‌ఎస్ నేతల) మాటలు నమ్మి ఆ ఆర్డినెన్స్‌నూ రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. తెరవెనుక లాబీయింగ్ చేసి ఆ కొందరు రాష్ట్రపతి వద్దకు ఆర్టినెన్స్ వెళ్లేలా చేశారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ సభ్యులు నోరు మెదపరు..
42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంగా చేశారని, కానీ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కూడా సంతోషపడతారని మాత్రం చెప్పలేకపోయారని చురకలంటించారు.
ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక సీఎంగా తాను అయిదుసార్లు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని గుర్తుచేశారు. అందుకే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. బీసీ కోటా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడితే వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు మాత్రం అటువైపైనా కన్నెత్తి చూడలేదని మండిపడ్డారు.
కనీసం రాజ్యసభలో బీసీ కోటాపై నోరెత్తలేదని ధ్వజమెత్తారు. బీసీ బిల్లులపై గంగుల కమలాకర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని తాను భావిస్తున్నానని, కానీ, ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని, బలహీన వర్గాలకు అనుమానాలు కలిగించే విధంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా, వారి పార్టీ ఆదేశానుసారంగా గంగుల మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు. ‘బీఆర్‌ఎస్ చేసిన తప్పులకు ఇప్పటికే ప్రజలు శిక్ష విధించారు.
అయినా మీరు మారడం లేదు. వందేళ్లుగా చేయని పని మేం చేస్తే.. మమ్మల్ని అభినందించి ఉంటే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పెద్దరికం పెరిగేది. కానీ, ఆయన సభకు రారు.. వచ్చిన వాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. ‘మంచి చెడ్డ ఉంటే నేను చూసుకుంటా. మాపై ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి. బీఆర్‌ఎస్ అధినేత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు. కల్వకుండా ఉంచడం వారి పని. వారికి బీసీలు, ఓసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు కల్వకుండా ఉంచడమే కావాలి’ అని సీఎం విమర్శించారు. ‘నాడు కేసీఆర్ 50 శాతం సీలింగ్ కారణంగా బీసీలకు 23 శాతం కోటా వచ్చింది.
మున్సిపాలిటీల్లో 31 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 2018లో చేసిన ఆ చట్టమే స్థానిక సంస్థల ఎన్నికలకు గుదిబండగా మారింది’ అని విమర్శించారు. ‘బీసీలకు మంచి జరిగే సమయం వచ్చింది. యజమానులను సంతోషం పెట్టేందుకు పరుష పదజాలాన్ని ప్రయోగించడం వల్ల బీఆర్‌ఎస్ సభ్యులే చులకనవుతారు. బీసీల కోటా బిల్లులపై చర్చ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు చేసిన పాపాలను మేం కడుగుతున్నాం. 50 శాతం నిబంధనను తొలగించేందుకు పెట్టిన బిల్లులను దయచేసి చర్చ లేకుండా మద్దతు తెలపండి’ అని సీఎం పిలుపునిచ్చారు.
భవిష్యత్‌లో ఆది శ్రీనివాస్ సీఎం కావాలని కోరుకుంటున్నా
రాష్ట్రప్రభుత్వం బీసీ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దీనిలో భాగంగా బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా కల్పించుకుని మాట్లాడబోయారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఇలాంటి సంప్రదాయాన్ని మేం ఎక్కడా చూడలేదు. ఆది శ్రీనివాస్ భవిష్యత్తులో మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకుంటున్నా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీలింగ్ విధించిందే బీఆర్‌ఎస్: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
బీసీ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను విధించిందే ఆ నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, ఆ సీలింగ్‌ను ఎత్తివేస్తూ తమ ప్రభుత్వం చట్టసవరణను చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. జనాభా పరంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, అందుకే 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసేందుకు చట్ట సవరణను చేస్తున్నామన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం తెచ్చిందని గుర్తుచేశారు.
గతంలో బీసీ రిజర్వేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి బంధువు అడ్డుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని, ఎవరో కోర్టుకు వెళితే సీఎంకు అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిఆర్‌ఎస్ తీర్మానం చేసిందని, మరీ బీఆర్‌ఎస్ అది సాధించిందా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపునకు 10 సంవత్సరాలు పట్టిందని, 24 జనవరి 1980లో బీసీ రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ సీఎం ఎంజీ రామచంద్రన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
నో ఎల్‌ఆర్‌ఎస్.. నో కాంగ్రెస్: బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు
తెలంగాణలో ‘నో ఎల్‌ఆర్‌ఎస్.. నో కాంగ్రెస్’ అనే పరిస్థితి భవిష్యత్‌లో వస్తుందని బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు జోస్యం చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తాం.. నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బీఆర్‌ఎస్ అన్నారు. ఇవాళ్నేమో ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపాలిటీల బిల్లుపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ బాధ్యత తీరదని, వాటికి నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బల్దియాల్లో దోమల మందు ఫాగింగ్‌కు కూడా డబ్బులు లేవని, పట్టణ ప్రగతి కింద వెంటనే మున్సిపాలిటీలకు నిధులను ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన ఎల్‌ఆర్‌ఎస్ సొమ్మును మున్సిపాలిటీలకు ఎప్పటి వరకు అందజేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి : ఎమ్మెల్యే గంగుల
బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, బహుజన రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం బీసీ బిల్లు తీసుకొచ్చి, ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. షెడ్యూల్‌ె 9లో బీసీ రిజర్వేషన్లను చేయాలని డిమాండ్ చేశారు. ‘సీలింగ్ పరిమితిని మించి తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా కోటా అమలు చేయండి. అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ‘మేం బీసీ రిజర్వేషన్లను స్వాగతిస్తాం. గతంలో పంపించిన బిల్లుల మాదిరిగా ఇప్పుడు కూడా కావొద్దు. ప్రభుత్వ జీవో న్యాయస్థానాల్లో నిలబడదు. రాజ్యాంగ పరిధిలోని 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పుడే న్యాయం జరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు.
బీజేపీ తీరు ఇక్కడ సై.. అక్కడ నై: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బీసీ బిల్లులకు అసెంబ్లీలో మద్దతు తెలుపుతున్న బీజేపీ కేంద్రంలో మాత్రం ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ తీరు ఇక్కడ సై.. అక్కడ నై’ అన్నట్లుగా ఉందని విమర్శించారు. కోటాను షెడ్యూల్ 9లో బీజేపీ చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
డొంక తిరుగుడు మాటలు!: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సభలో అందరి సభ్యుల మాటలు విన్నానని, అయినప్పటికీ... బీసీ బిల్లుకు ఎవరు అనుకూలమో.. వ్యతిరేకమో.. తనకు అర్థంకావడంలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
లీకులు ఇవ్వొద్దు..: ఎమ్మెల్యే గంగులకు మంత్రి పొన్నం
బీఆర్‌ఎస్ సభ్యులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునేలా లీకులు ఇవ్వొదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీ బిల్లులను ఆమోదించుకుని మూడ్ ఆఫ్ హౌజ్‌లో భాగంగా అందరం కలిసి గవర్నర్ వద్దకు వెళ్దామని పిలుపునిచ్చారు. అలా చేస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు.
ఆ పార్టీలో బీసీ నేతకు శాసనసభ పక్షనేత పదవి ఇస్తారని భావించామని, కానీ.. ఇవ్వలేదన్నారు. అందుకు బీఆర్‌ఎస్ సభ్యుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు 9వ షెడ్యూల్ లో మార్పు చేసే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చట్టాన్ని రూపొందించాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు కోట్లాది మంది బీసీల భావోద్వేగమన్నారు. ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్సే.. 42 శాతం బీసీలను తమ మంత్రివర్గం నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై శాస్త్రీయంగా సర్వే చేయకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
-మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఏకగ్రీవం
-ప్రైవేట్ మెడికల్ కేర్ బిల్లు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకూ..
మూడు కీలకమైన బిల్లులకు శనివారం శాసనసభలో ఆమోదం లభించింది. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. ఈ బిల్లులతో పాటు ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, జిన్నారం, ఇంద్రేశం నూతన మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లులకూ స్వల్ప చర్చ తర్వాత సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది